అత్యంత చవక .. రూ.83కే డబుల్​ బెడ్రూమ్ ఇల్లు

అత్యంత చవక .. రూ.83కే డబుల్​ బెడ్రూమ్ ఇల్లు
  • ప్రపంచంలోనే అత్యంత చవక ఇల్లుగా గుర్తింపు
  • అమెరికాలోని మిషిగాన్​లో అమ్మకానికి

మిషిగాన్ : ఎంత మారుమూల ప్రాంతమైనా ఒక ఇల్లు కొనాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ఇలా ఇండ్ల ధరలు ఆకాశన్నంటుతుంటే.. అమెరికాలో జిల్లో అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అత్యంత చవగా రూ.83(ఒక డాలర్) ధరకు ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటిని అమ్మకానికి పెట్టింది. మిషిగాన్‌‌ రాష్ట్రంలోని పోంటియాక్‌‌ లో పావు ఎకరం స్థలంలో 724 చదరపు అడుగుల వైశాల్యంతో ఈ ఇల్లు ఉంది. పైకప్పును తారుతో వేసిన ఈ ఇంటికి రిపేర్ పనులు చాలా ఉన్నాయి. వంటగది గోడల పెచ్చులు ఊడిపోయాయి.

బాత్రూమ్ మురికిగా ఉంది. పెరట్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. 1956లో నిర్మించిన దీనికి 45 వేల డాలర్ల ధర పలకొచ్చని జిల్లో కంపెనీకి చెందిన రియల్టర్ క్రిస్టోఫర్ హుబెల్ ఆశించారు. కానీ రిపేర్ వర్క్​లకే 20వేల డాలర్ల నుంచి 45వేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. మనం ఎంత రేటు చెప్పినా.. ఒక ఆస్తిని అమ్మకానికి పెట్టినప్పుడు మార్కెట్​చివరకు దాని అసలైన విలువను నిర్ణయిస్తుందని.. అందుకే ఇంటిని రూ.83కే  లిస్ట్ చేసినట్లు వివరించారు.

ఆసక్తి ఉన్న వాళ్లు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలలోగా అప్లై చేసుకోవాలన్నారు. ఇంటికి ప్రాపర్టీ టాక్స్​ఏడాదికి 1,200  డాలర్లు, ప్రతి నెల నీటి బిల్లు 50 డాలర్లు, డ్రైనేజీ బిల్లు నెలకు 75 డాలర్లు వస్తుందని వివరించారు.