రేప్ ఘ‌ట‌న‌ల్లో బాధితురాలిదే త‌ప్పని నేనెప్పుడూ అన‌లే

రేప్ ఘ‌ట‌న‌ల్లో బాధితురాలిదే త‌ప్పని నేనెప్పుడూ అన‌లే

ఇస్లామాబాద్: అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు కార‌ణాల‌పై పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ గ‌తంలో చేసిన కామెంట్స్ వివాదాస్ప‌దం కావ‌డంతో ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నారు. మ‌హిళ వ‌స్త్ర‌ధార‌ణ‌లో మార్పు వ‌స్తే అత్యాచార ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌వ‌ని, స‌మాజంలో టెంప్టేష‌న్ ధోర‌ణులను నిలువ‌రిస్తే ఈ ర‌క‌మైన నేరాలు త‌గ్గిపోతాయ‌ని గ‌తంలో అమెరికాలో ఓ మీడియా సంస్థ ఇంట‌ర్వ్యూలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని, రేప్ ఘ‌ట‌న‌ల్లో బాధితుల‌నే బాధ్యుల‌ను చేసేట‌వంటి స్టుపిడ్ కామెంట్స్ తాను ఎప్పుడూ చేయ‌లేద‌ని అన్నారు. తాను అన్న సందర్భం వేర‌ని, పాకిస్థాన్‌లో ఈ ర‌క‌మైన క్రైమ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో దానిపై అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తాను మాట్లాడానే త‌ప్ప‌, రేప్‌కు గురైన వారిదే త‌ప్పు అని చెప్ప‌డం త‌న ఉద్దేశం కాద‌న్నారు. కేవ‌లం పాకిస్థాన్‌ను ఉద్దేశించి మాత్ర‌మే తాను ఆ మాట‌లు అన్నాన‌ని చెప్పారు.

‘ఎప్పుడైనా స‌రే రేప్ చేసిన వ్య‌క్తిదే త‌ప్పు అవుతుంది. కేవ‌లం ఆ వ్య‌క్తే ఆ క్రైమ్‌కు బాధ్యుడు. బాధితురాలిని ఆ ఘ‌ట‌న‌కు బాధ్యురాలిగా చేయ‌లేం. ఆమె ఎంత రెచ్చ‌గొట్టేలా ఉన్నా, ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకున్నా స‌రే రేప్ చేసిన వాడే ఆ నేరానికి బాధ్యుడు’ అని పీబీఎస్ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ వివ‌ర‌ణ ఇచ్చారు. అంటే పాకిస్థాన్‌లో ఇస్లాం ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మీ వ్యాఖ్య‌ల‌ను పాక్ మ‌హిళ‌లకు వ‌ర్తిస్తాయ‌ని చెబుతున్నారా అని ఆ మీడియా సంస్థ ప్ర‌తినిధి అడగ్గా.. ‘అలాంటిదేం లేదు. ఇస్లాం మ‌హిళ‌ల‌ను గౌర‌విస్తుంది’ అని ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. కాగా, పాకిస్థాన్ ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం ఆ దేశంలో ప్ర‌తి రోజూ 11 రేప్ ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. గ‌డిచిన ఆరేండ్ల‌లో అక్క‌డ 22 వేల రేప్ కేసులు న‌మోద‌య్యాయ‌ని పోలీసు రికార్డులు స్ప‌ష్టం చేస్తున్నాయి.