ఏలియన్స్​తో మాట.. సాగిందిలా..!

ఏలియన్స్​తో మాట.. సాగిందిలా..!

సరిగ్గా 42 ఏండ్ల కిందట ఆకాశం నుంచి ఓ శక్తిమంతమైన సిగ్నల్ ​భూమి మీదకు వచ్చింది.  ఆకాశం వైపు నిఘానేత్రాన్ని ఉంచి అందుకోసమే ఎదురు చూస్తున్న బిగ్​ఇయర్ ​రేడియో టెలిస్కోపు దానిని  యాంటెన్నాతో పట్టేసింది.  అంత పవర్​ఫుల్​ సిగ్నల్‌‌ను సైంటిస్టులు అందుకోవడం అదే మొదటిసారి. దురదృష్టవశాత్తూ అదే చివరి సారి కూడా అయింది! ఈ సిగ్నల్​ను ఒహాయో స్టేట్​ యూనివర్సిటీకి చెందిన బిగ్​ఇయర్​ రేడియో టెలిస్కోపు ద్వారా అమెరికా ఆస్ట్రానమర్‌‌ జెర్రీ ఎహ్మాన్ 1977 ఆగస్టు 15న రికార్డ్ ​చేశారు. అప్పట్నుంచి అది మిస్టరీనే.  

‘వావ్’ అనిపించిన సిగ్నల్​

ఎలియన్స్​ ఉనికిని కనిపెట్టాలని సైంటిస్టులు ఎప్పటి నుంచో రీసెర్చ్​లు చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడుకొందరు తాము ఎలియన్ ​సిగ్నళ్లను కనిపెట్టామోచ్ అంటూ ఎగిరిగంతేసినా.. అవి కచ్చితంగా అవేనని  చెప్పేందుకు  ఇంతవరకూ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇక జెర్రీ ఎహ్మాన్ ​వావ్​ సిగ్నల్​ను అందుకోగానే ఉబ్బితబ్బిబ్బయ్యారు. అప్పట్లో డిజిటల్ ​రూపంలో సిగ్నళ్లను భద్రపర్చే చాన్స్​ లేకపోవడంతో ఆయన కంప్యూటర్ ప్రింట్‌‌ తీసుకున్నారు.  లెక్కలేసి ‘వావ్’ అని రాశారు. ఆ సిగ్నల్ వివరాలు తెలుసుకుని ఇతర సైంటిస్టులు కూడా వావ్​అనేశారు. ఎందుకంటే.. ఇలాంటి సిగ్నళ్లను ఎలియన్స్​ మాత్రమే పంపేందుకు చాన్స్ ​ఉంటుందని, మనకు తెలిసిన నక్షత్రాలు, గ్రహాల నుంచి ఇలాంటి సిగ్నళ్లు వచ్చే చాన్సే లేదని వారు తేల్చేశారు. దీంతో అప్పటి నుంచి దానిని వావ్​సిగ్నల్ ​అని పిలుస్తున్నారు.

వావ్ ​సిగ్నల్ ​సాగిటారస్ ​నక్షత్ర మండలం (ధనస్సు రాశి‌‌‌‌‌‌‌‌) నుంచి వచ్చిందని ఎహ్మాన్​ వెల్లడించారు. అయితే, భూమి తిరుగుతూ ఉండటం వల్ల అది బిగ్​ఇయర్​ టెలిస్కోపు యాంటెన్నాకు 72 సెకన్లపాటు మాత్రమే చిక్కిందని చెప్పారు. ఆ సిగ్నల్ కంప్యూటర్​ స్క్రీన్​పై నిమిషంపైగా మెరిసి, మాయమైందన్నారు. విశ్వంలోని ఇతర నక్షత్రాల నుంచి వచ్చే కాంతి ఫ్రీక్వెన్సీ 1 నుంచి 10 గిగాహెర్జ్ మధ్యలో ఉంటేనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వావ్​ సిగ్నల్​సరిగ్గా 1.42 గిగాహెర్జ్ ​ఫ్రీక్వెన్సీతో వచ్చినట్లు తేలింది. దీంతో ఇది ఎలియన్ ​సిగ్నలే అని చాలామంది తేల్చేశారు. మరికొందరేమో అది విశ్వంలోని ఏదో ఒక కాంతి రేఖ అయి ఉండొచ్చు కదా? అని కొట్టిపారేశారు. అయితే, వావ్​ సిగ్నల్‌‌ను ​కనుగొన్న కొన్నేండ్లకు బిగ్ ​ఇయర్​ రేడియో టెలిస్కోపును ఆపేశారు.