WPL 2024: మహిళా క్రికెటర్ అసాధారణ ఇన్నింగ్స్.. బ్యాట్ తనిఖీ చేసిన మ్యాచ్ రిఫరీ

WPL 2024: మహిళా క్రికెటర్ అసాధారణ ఇన్నింగ్స్.. బ్యాట్ తనిఖీ చేసిన మ్యాచ్ రిఫరీ

డబ్ల్యూపీఎల్ 2024లో ముంబై మహిళా జట్టు అదరగొడుతున్న విషయం తెలిసిందే. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాల(10 పాయింట్లు)తో టాప్‌లో నిలిచి ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకొంది. శనివారం(మార్చి 9) గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. విజయానికి చివరి 6 ఓవర్లలో 91 పరుగులు కావాల్సి ఉన్నా.. అంత లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్(95 నాటౌట్‌; 48 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడింది. ఇదే మ్యాచ్ అధికారుల్లో కొత్త అనుమానాలు రేకెత్తించింది.

భారీ లక్ష్యం

నిజానికి మహిళా క్రికెట్‌లో 190 పరుగుల లక్ష్యాన్ని చేదంచడమంటే అంత ఈజీ కాదు. అందునా చివరి 6 ఓవర్లలో 90 పరుగులు రాబట్టడమంటే మాటలు కాదు. ప్రతి ఓవర్‌కు 15 పరుగులు చొప్పున సాధించాలి. ఏ ఒక్క ఓవర్‌లో 5-6 పరుగులొచ్చినా ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. అలాంటిది ముంబై మహిళలు ఎలాంటి భయం, బెణుకు లేకుండా ఆడుతూ పాడుతూ భారీ లక్ష్యాన్ని చేధించారు. 

Also read : గతాన్ని మర్చిపోని లంకేయులు.. బంగ్లా ఆటగాళ్లను అవమానించేలా చర్యలు

బ్యాట్ చేంజ్.. ఫలితం తారుమారు

ఈ మ్యాచ్‌లో ఒకానొక సందర్భంలో హర్మన్‌ప్రీత్ బ్యాట్ చేంజ్ చేసింది. అంతే, అందులో దాగున్న మహిత్యం ఏంటో కానీ, ఆ తరువాత మాత్రం చెలరేగిపోయింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ మ్యాచ్ చూసే ప్రేక్షకులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. గెలుపునకు చివరి 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సి ఉండగా.. రాణా వేసిన 18వ ఓవర్‌లో హర్మన్‌ 24 పరుగులు రాబట్టడంతో మ్యాచ్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

బ్యాట్ తనిఖీ చేసిన మ్యాచ్ రిఫరీ

మ్యాచ్ ముగిసిన అనంతరం హర్మన్‌ప్రీత్ బ్యాట్ ను మ్యాచ్ రిఫరీ తనిఖీ చేశారు. లోపల స్ప్రింగ్ లు ఏమైనా ఉన్నాయా..! అన్నట్లుగా సౌండ్ పరీక్షించారు. తన ప్రాక్టీస్ బ్యాట్‌పై ఉన్న పట్టు కారణంగానే బ్యాట్ చేంజ్ చేసినట్లు హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2003 ప్రపంచ కప్ ఫైనల్ ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రికీ పాంటింగ్(140; 121 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఇన్నింగ్స్ ఇలాంటి ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.

మ్యాచ్ స్కోర్లు: 

గుజరాత్ జెయింట్స్: 190/7
ముంబై ఇండియన్స్: 191/3 (19.5 ఓవర్లలో)