- 3 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపు
- డిక్లెర్క్ ఆల్‌రౌండ్ షో.. సజన, నికోలా కారీ మెరుపులు వృథా
నవీ ముంబై: టార్గెట్ ఛేజింగ్‌లో రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌లో బోణీ చేసింది. నాడిన్ డిక్లెర్క్ (44 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63 నాటౌట్, 4/26) ఆల్‌రౌండ్ షోతో చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో బెంగళూరు 3 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 154/6 స్కోరు చేసింది. సాజీవన్ సజన (25 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) టాప్ స్కోరర్. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. ఓపెనర్లు గ్రేసీ హారిస్ (25), స్మృతి మంధాన (18) తొలి వికెట్‌కు 3.5 ఓవర్లలోనే 40 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. కానీ ఇక్కడి నుంచి విజృంభించిన ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీశారు. హేమలత (7), రిచా ఘోష్ (6), రాధా యాదవ్ (1) నిరాశపర్చారు. 65/5తో కష్టాల్లో పడిన ఆర్సీబీకి డిక్లెర్క్ ఒంటిచేత్తో విజయాన్ని అందించింది. ముంబై బౌలర్లు ఒత్తిడి పెంచినా చివరి వరకు క్రీజులో నిలిచింది. రెండో ఎండ్‌లో అరుంధతి రెడ్డి (20) వేగంగా ఆడి అండగా నిలిచింది ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 52 రన్స్ జోడించారు. అరుంధతితో పాటు శ్రేయంకా (1) వెంటవెంటనే ఔటైనా.. చివర్లో ప్రేమ రావత్ (8 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. ఆర్సీబీ గెలుపుకు చివరి 6 బాల్స్‌లో 18 రన్స్ అవసరమైన దశలో డిక్లెర్క్ 6, 4, 6, 4తో విజయాన్ని అందించింది. కెర్ర్, కారీ చెరో రెండు వికెట్లు తీశారు. డిక్లెర్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 154/6 (సజన 45, కెరీ 40, డిక్లెర్క్ 4/26). బెంగళూరు: 20 ఓవర్లలో 157/7 (డిక్లెర్క్ 63*, గ్రేసీ హారిస్ 25, కెర్ర్ 2/13, కారీ 2/35).
డిక్లెర్క్ బౌలింగ్ షో..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైని కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా నాడిన్ డిక్లెర్క్ (4/26) మిడిలార్డర్‌ను దెబ్బకొట్టి స్కోరు బోర్డుకు అడ్డుకట్ట వేసింది. లారెన్ బెల్ (1/14), శ్రేయంకా పాటిల్ (1/32) అండగా నిలిచారు. ఆరంభంలో ఓ ఎండ్‌లో ఓపెనర్ కమళిని (32) దూకుడుగా ఆడినా.. రెండో ఎండ్‌లో అమెలియా కెర్ర్ (4), సివర్ బ్రంట్ (4) సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై 35/2తో నిలిచింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) కాసేపు బ్యాట్ అడ్డేసింది. కమళినితో కలిసి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసింది. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 28 రన్స్ జోడించి కుదురుకున్నట్లు కనిపించారు. కానీ నాలుగు రన్స్ తేడాతో ఇద్దరూ ఔట్ కావడంతో ముంబై 11 ఓవర్లలో 67/4తో కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి నికోలా కారీ (29 బాల్స్‌లో 4 ఫోర్లతో 40), సజన మెరుగ్గా ఆడారు. ఆర్సీబీ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ క్రమంగా రన్‌రేట్ పెంచారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు కొట్టి ఐదో వికెట్‌కు 49 బాల్స్‌లోనే 82 రన్స్ జత చేశారు. చివరి ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో వీరిద్దరు వెనుదిరిగినా ముంబై మంచి టార్గెట్‌నే నిర్దేశించింది.
కలర్‌ఫుల్‌గా ఓపెనింగ్ సెర్మనీ
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ ఓపెనింగ్ సెర్మనీ కలర్‌ఫుల్‌గా జరిగింది. ప్రఖ్యాత ర్యాపర్ యోయో హనీ సింగ్‌తో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, 2021 మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ సంధు తమ ఆటపాటలతో అలరించారు. ముందుగా జాక్వెలిన్ బాలీవుడ్‌తో పాటు ఇతర పాటలకు అద్భుతమైన స్టెప్పులతో అలరించింది. ‘లాల్ పారి’లో తన పెర్ఫామెన్స్‌తో పాటు గ్రూప్ డ్యాన్స్‌లతో ఆకట్టుకుంది. ఆ తర్వాత హనీ సింగ్ తన ప్రసిద్ధ ట్రాక్ బ్లూ ఐస్‌ను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరిచాడు. తర్వాత లుంగీ డాన్స్‌తో అలరించాడు. ఈ ఇద్దరికి తోడుగా హర్నాజ్ కూడా స్టేజ్‌పైకి రావడంతో వాతావరణం సందడిగా మారింది. చివరకు ఈ ముగ్గురు కలిసి చేసిన ‘పార్టీ ఆల్ నైట్’ పెర్ఫామెన్స్ అందర్ని ఆకట్టుకుంది. బాణా సంచా వెలుగులో స్టేడియం జిగేల్ మనిపించింది. చివరగా ముంబై, బెంగళూరు కెప్టెన్లు హర్మన్‌ప్రీత్, స్మృతి మంధానా మధ్యలో కూర్చొని హనీ సింగ్ కొన్ని పాటలు పాడాడు.
