స్నేహితుడే హంతకుడు!డబ్బుల గొడవల్లోనే రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య

స్నేహితుడే హంతకుడు!డబ్బుల గొడవల్లోనే రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య
  •     డబ్బుల గొడవల్లోనే రచయిత బొగ్గుల శ్రీనివాస్​ హత్య
  •     రూ.5 లక్షల సుపారీ ఇచ్చి మర్డర్‌‌‌‌ చేయించిన ఫ్రెండ్‌‌
  •     రూ.30 లక్షల విషయంలో వేణుమాధవ్‌‌రెడ్డితో వివాదం
  •     డబ్బుల పంపకాల్లో విభేదాలతోనే కత్తులతో పొడిచి మర్డర్‌‌‌‌

ఖమ్మం, వెలుగు:  రచయిత బొగ్గుల శ్రీనివాస్​ మర్డర్​ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆర్థిక వివాదాల వల్లే  హత్య జరిగిందని తేల్చారు. స్నేహితుడే రూ.5 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించి..  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టు తేల్చారు.  ప్రధాన నిందితుడు మేకల వేణుమాధవ్‌‌రెడ్డితోపాటు ముగ్గురు హంతకులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేసి  రిమాండ్‌‌కు తరలించారు. హత్య వివరాలను పోలీసులు ఆదివారం మీడియాకు  వెల్లడించారు. అశ్వారావుపేటకు చెందిన సుపారీ ముఠా కత్తులతో పొడిచి, ఇనుపరాడ్లతో కొట్టి శ్రీనివాస్‌‌ను హత్య చేసిందని,  ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్‌‌పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, ఆ పార్టీ కార్యకర్తలకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని ఏసీపీ స్పష్టం చేశారు.

రూ.30 లక్షలకు సంబంధించి గొడవ!

ఏపీలోని నందికొట్కూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్  20 ఏండ్లుగా హైదరాబాద్‌‌లో ఉంటూ  యూట్యూబర్‌‌‌‌గా, రచయితగా పాపులర్​ అయ్యారు.  ఆయనతోపాటు కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్న ఏపీలోని సత్తెనపల్లికి చెందిన మేకల వేణుమాధవ్‌‌రెడ్డి  కొంతకాలం కింద  కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నారు.  శ్రీనివాస్‌‌కు బొగ్గుల బీబీక్యూ పేరుతో జీఎస్టీ లైసెన్స్ ఉంది.  వేణుమాధవ్‌‌రెడ్డి ‘మేకా ప్రాజెక్ట్స్’ పేరుతో కంపెనీని స్థాపించి సబ్ కాంట్రాక్టర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు.  శ్రీనివాస్‌‌కు చెందిన జీఎస్టీ లైసెన్స్‌‌ను ఉపయోగించుకొని, ఫేక్​ ఇన్‌‌వాయిస్‌‌ల ద్వారా సేల్స్​ చేసి జీఎస్టీ రీఫండ్​ ద్వారా  లాభాలు సంపాదించొచ్చని వేణుమాధవ్‌‌రెడ్డి చెప్పగా.. శ్రీనివాస్​ ఒప్పుకున్నాడు. జీఎస్టీ లైసెన్స్​ఇచ్చినందుకు  50 శాతం ప్రాఫిట్ ఇవ్వాలని మాట్లాడుకున్నారు. 2022 నుంచి 2025 వరకు మూడేండ్లలో జీఎస్టీ ఫైలింగ్స్‌‌తో రూ.90 లక్షల వరకు వేణుమాధవ్​ సంపాదించాడు. ఇందులో శ్రీనివాస్​ వాటా రూ.45 లక్షలకుగానూ రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చి.. మిగిలిన రూ.30 లక్షలు పెండింగ్ పెట్టాడు. ఇదే సమయంలో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన జీఎస్టీ అధికారులు  శ్రీనివాస్‌‌కు నోటీసులు ఇవ్వడంతోపాటు  జీఎస్టీ  లైసెన్స్​కూడా రద్దు  చేశారు. దీంతో తనకు రావాల్సిన రూ.30 లక్షలు ఇవ్వాలని,  జీఎస్టీ లైసెన్స్‌‌ను యాక్టివేట్ చేయించాలని  వేణుమాధవ్‌‌రెడ్డిపై శ్రీనివాస్​ ఒత్తిడి తెచ్చాడు. అయితే దీనికి రూ.కోటికి పైనే జరిమానా కట్టాల్సి ఉంటుందంటూ శ్రీనివాస్‌‌కు వేణుమాధవ్​ చెప్పాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి.

సుపారీ గ్యాంగ్‌‌తో మర్డర్‌‌‌‌కు ప్లాన్‌‌

తనపై  ఒత్తిడి చేస్తున్న  శ్రీనివాస్‌‌ను ఎలాగైనా తప్పించాలని వేణుమాధవ్‌‌రెడ్డి ప్లాన్​ చేశాడు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటకు చెందిన సుపారీ గ్యాంగ్​ పోకల కోటేశ్వర్‌‌‌‌రావు, షేక్ అబ్దుల్ హఫీజ్, మహ్మద్ అజ్మత్ ఆలీ ఖాన్‌‌తో కలిసి శ్రీనివాస్ హత్యకు కుట్ర పన్నాడు. వారికి  రూ.5 లక్షలు   చెల్లించాడు. ఈనెల 13న రాత్రి విజయవాడలో రూ.30 లక్షలు ఇస్తానంటూ  శ్రీనివాస్‌‌ను నమ్మించి హైదరాబాద్​నుంచి  ఏపీ 16 డీపీ 2345 కారులో ఎక్కించుకున్నాడు. తన స్నేహితులని చెప్పి  సుపారీ గ్యాంగ్‌‌ను కూడా కారులో ఎక్కించుకున్నాడు. ఈ నెల 14న తెల్లవారుజామున నకిరేకల్ నుంచి జనగామ వెళ్లే దారిలో నిర్మానుష్య ప్రదేశంలో నిందితులు కత్తులు, ఐరన్ రాడ్లతో శ్రీనివాస్ తలపై కొట్టి, పొడిచి హత్య చేశారు. తర్వాత రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు పాలేరు రిజర్వాయర్‌‌‌‌లోకి తోశారు.  అయితే, అప్పటికే తెల్లవారడం, డ్రైవర్​ సీటులో ఉన్న వ్యక్తి కారు నుంచి దిగి వెళ్లిపోవడం మత్స్యకారులు గమనించడంతో ప్లాన్​ రివర్స్​ అయింది. కారును నీళ్ల నుంచి వెలికి తీసిన తర్వాత డెడ్ బాడీపై కొట్టిన గాయాలు, పదునైన ఆయుధంతో పొడిచిన ఆనవాళ్లు ఉండడంతో మర్డర్​అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. 

4 బృందాలుగా దర్యాప్తు..

పాలేరు రిజర్వాయర్‌‌‌‌లో కారును వెలికి తీసిన తర్వాత లభించిన ఆధారాలతోపాటు హత్యేనని క్లారిటీ రావడంతో ఖమ్మం రూరల్​ ఏసీపీ తిరుపతిరెడ్డి ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. సెల్‌‌ఫోన్ల కాల్ డేటాతోపాటు హైదరాబాద్ నుంచి మామిళ్లగూడెం వరకు టోల్ గేట్ల దగ్గర రికార్డు అయిన సీసీ ఫుటేజీ, ఆర్థిక విభేదాల గురించి ఎంక్వైరీలో బయటపడడంతో ఎవరు హత్యకు పాల్పడి ఉంటారనేది పోలీసులు పసిగట్టారు. ఘటనా స్థలంలో దొరికిన కారు వేణుమాధవ్‌‌రెడ్డిది కావడం, ఆ రోజు నుంచి అతను పరారీలో ఉండడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అయినా పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ చేసి, వారం రోజుల్లో కేసును ఛేదించారు.