
ఏ, బీ, సీ గ్రూపులుగా రోస్టర్..
యూనివర్సిటీలో రోస్టర్ల పాయింట్ల ఎంపికను గ్రూపులుగా చేయనున్నారు. ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, లా సబ్జెక్టులు గ్రూప్ ఏలో, అన్ని సైన్స్ సబ్జెక్టులను, గ్రూప్ బీలో, టెక్నికల్ కోర్సుల విభాగాలను గ్రూప్ సీగా వ్యవహరించనున్నట్లు తెలిసింది.
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లో ఇక నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను రాత పరీక్ష ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఇంటర్వ్యూ పద్ధతిలో నియామకాలు చేస్తుండగా, అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, కాకతీయ యూనివర్సిటీలో 2009, 2013లో జరిగిన రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రోస్టర్ పాయింట్ల విషయంలో ప్రత్యేక విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
వీసీల నియామకం తర్వాతే..
వివిధ యూనివర్సిటీల్లో1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అనుమతించింది. రోస్టర్ పాటించే విషయంలో యూనివర్సిటీని యూనిట్‌గా కాకుండా డిపార్ట్‌మెంట్లను యూనిట్‌గా తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పడంతో అప్పట్లో నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత యూనివర్సిటీ యూనిట్‌గానే రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే యూజీసీ కూడా ఖాళీ పోస్టులు పోస్టుల భర్తీ చేయాలని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చే సమయానికి వైస్ చాన్స్‌లర్ల పదవీ కాలం పూర్తి కావడం, ప్రస్తుతం ఇన్‌చార్జీ వీసీల పాలన సాగుతుండడంతో ఎలాంటి నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే వీసీల నియామకం పూర్తయ్యాకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.