ప్రపంచంలోనే తొలి 'రాడార్‌-ఇంటిగ్రేటెడ్' బైక్: అల్ట్రావయొలెట్ X47 క్రాసోవర్ స్పెషాలిటీస్ ఇవే..

ప్రపంచంలోనే తొలి 'రాడార్‌-ఇంటిగ్రేటెడ్' బైక్: అల్ట్రావయొలెట్ X47 క్రాసోవర్ స్పెషాలిటీస్ ఇవే..

భారత ఈవీ టూ-వీలర్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి బెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ సిద్ధమైంది. కంపెనీ విడుదల చేసిన ఎలక్ట్రిక్ క్రాసోవర్ మోటార్‌సైకిల్ 'X47' ఫీచర్లు బైకర్లను ఆకట్టుకుంటున్నాయి. బైక్ రేటు రూ.2లక్షల 74వేలు ఉండగా.. మెుదటి వెయ్యి మందికి దీనిని రూ.2లక్షల 49వేలకే అందించాలని కంపెనీ నిర్ణయించింది. బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా.. కంపెనీ డెలివరీలు అక్టోబర్ 2025 నుంచి మెుదలుపెడుతోంది. 

కంపెనీ దీనిని ఫైటర్ జెట్ ప్రేరణతో డిజైన్ చేసింది. బైక్ పూర్తిగా.. అల్ట్రావయొలెట్ ఫ్లాగ్‌షిప్ F77 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించారు. బైక్ ముందర ముక్కు ఆకారంలో ఉండే ఫ్రంట్ ఫెండర్, చెక్కినట్లుగా ఉండే ట్యాంక్, కాస్ట్ అల్యూమినియం సబ్-ఫ్రేమ్‌పై మౌంట్ చేయబడిన రేక్డ్ టెయిల్ సెక్షన్ దీనికి ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చాయి. అలాగే ప్రపంచంలోనే మెుట్టమెుదటిసారిగా మోటార్‌సైకిల్‌లో రాడార్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది కంపెనీ. ఇది రైడర్ల భద్రత.. సౌలభ్యాన్ని మెరుగుపరుస్తోంది. 

రాడార్ వ్యవస్థతో బైకర్లకు అందే లాభాలు..
* బ్లైండ్ స్పాట్ మానిటరింగ్: రైడర్ దృష్టికి అందని ప్రాంతాల్లోని వాహనాలను పసిగట్టి అప్రమత్తం చేస్తుంది.
* లేన్ చేంజ్ అసిస్ట్: లేన్ మారుతున్నప్పుడు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటే హెచ్చరిస్తుంది.
* ఓవర్‌టేక్ అలర్ట్ : పక్క లేన్‌ల నుంచి వెనుక నుండి వేగంగా వస్తున్న వాహనాలను ట్రాక్ చేసి హెచ్చరికలు ఇస్తుంది.
* రియర్ కొలిషన్ వార్నింగ్: వెనుక నుండి ఢీకొనే ప్రమాదం ఉంటే వెంటనే హెచ్చరికలు ఇవ్వడంతో పాటు.. అత్యవసర పరిస్థితుల్లో ఇతర వాహనాలను అప్రమత్తం చేయడానికి హజార్డ్ లైట్లను కూడా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేస్తుంది.

ఇక పనితీరు విషయానికి వస్తే.. X47 క్రాసోవర్ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారు ద్వారా 40 బిహెచ్‌పి పవర్, ఏకంగా 610Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.7 సెకన్లలో 0-60 km/h వేగాన్ని, 8.1 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. అలాగే గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఈ ఎలక్ట్రిక్ వాహనం. ముందుగా 7.1 kWh బ్యాటరీ ప్యాక్ 211కిమీ రేంజ్ ఆఫర్ చేస్తుండగా.. 10.3 kWh బ్యాటరీ ప్యాక్ 323 కిమీ రేంజ్ అందిస్తోందని కంపెనీ చెబుతోంది. అలాగే యాంటీ-థెఫ్ట్ మౌంట్, Wi-Fi/Bluetooth కనెక్టివిటీ మరియు 256GB వరకు స్టోరేజ్ ఫీచర్లు కూడా ఇందులో అందిస్తోంది కంపెనీ.