- యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు
 
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన వడ్లకు సరిపడా మాయిశ్చర్(తేమ శాతం) వస్తే.. రాత్రి సమయంలో కూడా వడ్ల కాంటా వేయాలని నిర్వాహకులకు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం చొల్లేరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులతో స్వయంగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా.? అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల కారణంగా ఏ క్షణంలో వర్షం పడుతుందో అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను టార్పాలిన్లతో కప్పి భద్రపర్చుకోవాలని రైతులకు సూచించారు.
ఇక ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వడ్ల కుప్పల్లో తేమ శాతం చెక్ చేయాలని, సాయంత్రం వేళల్లో గనుక మాయిశ్చర్ వస్తే వెంటనే కాంటా వేసి వడ్లను మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డివిజన్ ఏడీఏ శాంతినిర్మల, తహశీల్దార్ గణేష్ నాయక్, మండల వ్యవసాయ అధికారి సుధారాణి, ఏఈవోలు, ఐకేపీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
