- దేవాదాయశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు యాదాద్రి పరిరక్షణ కమిటీ ధర్నా
- ధర్నాకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మద్దతు
హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట కొండపై ఏండ్ల తరబడి సాగుతున్న వర్తక సంఘం ఆధిపత్యానికి చెక్‌పెట్టాలని, తక్షణమే షాపులకు బహిరంగ టెండర్లు పిలవాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్ ఆబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. వర్తక సంఘం పేరుతో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. వర్తక సంఘం ముసుగులో కొందరు వ్యక్తులు దేవాదాయశాఖ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని విమర్శించారు. కొండపై ఉన్న 10 షాపులకుగాను ఏడాదికి కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తూ, వాటిని ఇతరులకు సబ్ లీజుకు ఇస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఆరోపించారు.
ఈ అక్రమ దందాలో దేవాదాయశాఖకు చెందిన కొందరు అధికారులు కూడా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు అవినీతికి కొమ్ముకాయడం సరికాదని హితవు పలికారు. కొండపై ఉన్న షాపులను స్థానిక నిరుద్యోగులకు కేటాయించాలని, పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, ధర్నా చేస్తున్న యాదాద్రి పరిరక్షణ కమిటీ నాయకులను భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కలిసి సంఘీభావం తెలిపారు. యాదగిరిగుట్టలో సామాన్య నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు
