యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
దీంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. రద్దీ కారణంగా ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణ స్వామి వ్రత మండపాలు, అన్నప్రసాద వితరణ కేంద్రం, పార్కింగ్ ఏరియా, కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి.
10,819 మంది వీఐపీ టికెట్ల ద్వారా, 2,667 మంది బ్రేక్ దర్శనాలు చేసుకున్నారు. స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
భారీగా ఆదాయం..
వివిధ రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.81,77,104 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.23,02,040, వీఐపీ దర్శనాలతో రూ.16,22,850, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.10,03,500, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.8,00,100 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
