మార్చి 4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

మార్చి 4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈసారి బాలాలయంలో అంతరంగికంగా నిర్వహించడానికి ఆఫీసర్లు సన్నాహాలు చేస్తు న్నారు. మార్చి 4 నుంచి 14 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఈఓ గీతారెడ్డి తెలిపారు. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతో వైభవంగా ఆలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో చినజీయర్ స్వామి సూచన మేరకు బ్రహ్మోత్సవాలను బాలాలయంలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఉత్సవాలు ఇలా..

మార్చి 4న స్వస్తివాచనంతో మొదలై మార్చి14న అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజుల్లో ఆర్జిత సేవలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలను రద్దు చేశారు. మార్చి4న స్వస్తి వాచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 11 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామివారిని పలు అవతారాల్లో ఆలయ తిరువీధుల్లో ఊరేగిస్తారు. మార్చి 10న రాత్రి 9 గంటలకు ఎదుర్కోలు, 11న ఉదయం 11 గంటలకు కల్యాణం, 12న రాత్రి 7 గంటలకు దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు. మార్చి 14న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.