యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

యాదాద్రి ఆలయం పునః ప్రారంభమైంది. ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ పూర్తయ్యింది. ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వేదమంత్రోచ్చారణల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నంలో.. పుష్కరాంశ శుభ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరిగింది. ఈ సందర్బంగా మూడుసార్లు స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. స్వర్ణ ధ్వజస్తంభ దర్శనంతో పాటు స్వయంభూ దర్శనం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు లక్ష్మీ నర్సింహుడికి తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కేసీఆర్ దంపతులను శాలువాతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ప్రధానాలయం చుట్టూ నిర్వహించే స్వామివారి శోభయాత్రలో సీఎం పాల్గొన్నారు. తర్వాత ప్రధానాలయ విమాన గోపురం దగ్గర మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్నారు. కొండ కింద యాగస్థలంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి కేసీఆర్ భోజనాలు చేస్తారు. తర్వాత తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు.

ఒక్కో మంత్రికి.. ఒక్కో గోపురం

ఇవాళ యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహుడి ఆలయ ఉద్ఘాటన వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సప్త గోపురాలకు మంత్రులు అభిషేకం నిర్వహించారు. ఒక్కో మంత్రికి ఒక్కో గోపురం కేటాయించారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కోసం పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. దివ్య విమాన గోపురానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ పూజలు చేశారు. ఆంజనేయస్వామి ఆలయానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గరుడ ఆళ్వార్ సన్నిధికి శాసనసభ స్పీకర్ పోచారం సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్నారు. 

తూర్పు రాజగోపురానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశ్చిమ రాజగోపురానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, దక్షిణ రాజగోపురానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఈశాన్య ప్రాకార మంటపానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి, విష్వక్సేన మండపానికి ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. పశ్చిమ రాజగోపురానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, తూర్పు రాజగోపురానికి మంత్రి సత్యవతి రాథోడ్ సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్నారు. మిగతా మండపాలు, అష్టభుజి ప్రాకారాలు, ప్రాకారాలు, యాలీ పిల్లర్లు, బాహ్య ప్రాకారాలు, అంతర్ ప్రాకారాలకు ప్రభుత్వ విప్ లు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, సీఎంవో ఆఫీసర్లు, వైటీడీఏ ఆఫీసర్లు, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. యాదాద్రిలో సాయంత్రం 3 గంటల నుంచి భక్తులకు స్వయంభువు లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు కల్పించనున్నారు. యాదాద్రిక్షేత్రంలో ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు సజావుగా సాగేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఇవి కూడా చదవండి

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది