
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం బయటపడింది. సిరిపురం గ్రామంలోని ఓ రైతుకు చెందిన భూమి పట్టా తన బంధువుల పేరు మీదకు మార్చాడు డిప్యూటీ తహశీల్దార్. బాధితుడు అనంతరెడ్డి ఫిర్యాదు చేయడంతో.. డిప్యూటీ తహశీల్దార్, ధరణి ఆపరేటర్ పై చర్యలకు ఆదేశించారు తహశీల్దార్.
రిటైర్ట్ హెడ్ మాస్టర్ అయిన అనంతరెడ్డి తొలివిడత రైతుబంధు డబ్బులు పొందాడు. ఆ తర్వాత అకౌంట్లో డబ్బులు రాకపోవడంతో వీఆర్వో రమేష్ ను నిలదీశాడు. అయితే కంప్యూటర్ లో మిస్టేక్ ఉందని వీఆర్వో బుకాయించాడు. అనుమానం వచ్చిన అనంతరెడ్డి… పహాణి చెక్ చేయడంతో తన భూమి వేరేవాళ్లపై ఉన్నట్లు చూసి షాక్ అయ్యాడు. ఏకంగా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారు. ఈ విషయంపై మళ్లీ వీఆర్వోను నిలదీయడంతో .. ఆ భూమిని డిప్యూటీ తహశీల్దార్ ఇబ్రహీం…. తన బంధువుల పేరు మీదకు బదిలీ చేయించినట్లు వీఆర్వో అంగీకరించాడు. అయితే విషయం బయటకు రావడంతో విచారణ జరిపిన తహశీల్దార్.. దీనికి బాధ్యులైన అధికారులకు మెమోలు జారీ చేశారు.