‘గుట్ట’ హుండీ ఆదాయం రూ.98.49 లక్షలు

‘గుట్ట’ హుండీ ఆదాయం రూ.98.49 లక్షలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 16 రోజుల హుండీ ఆదాయం రూ. 98.49 లక్షలు వచ్చింది. హుండీలను గురువారం హరిత టూరిజం హోటల్​కు తరలించి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని లెక్కించారు. నగదు  రూ.98,49,445 రాగా, 173 గ్రాముల బంగారం, 2 కిలోల 60 గ్రాముల వెండి సమకూరిందని ఈవో గీతారెడ్డి చెప్పారు. ఇక హుండీలలో భక్తులు విదేశీ కరెన్సీ కూడా భారీ మొత్తంలో సమర్పించారు. 

కొత్త మండపంలో వ్రతాలు షురూ

యాదగిరిగుట్టలో కొండ కింద నిర్మించిన సత్యనారాయణస్వామి వ్రత మండపం గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. గురువారం 218 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వ్రతాల ద్వారా ఆలయానికి రూ.1,74,400 ఆదాయం వచ్చింది. స్టేట్ ట్రాన్స్​పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కృష్ణమనేని పాపారావు, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు నిర్వహించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా గురువారం ఆలయానికి రూ.16,74,295 ఇన్ కం సమకూరింది.