యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వర్తక సంఘం ఆధ్వర్యంలోని షాపులను రద్దు చేస్తే దాదాపు 500 కుటుంబాలు రోడ్డున పడతాయని యాదగిరిగుట్ట కొండపై వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల సమయంలో గతంలో కొండపై ఉన్న 114 షాపులు కూల్చివేయడంతో వ్యాపారులు వర్తక సంఘంగా ఏర్పడి ప్రస్తుతం 10 షాపుల్లోనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు వర్తక సంఘాన్ని రద్దు చేయాలని కొందరు యువత ఆందోళనలు చేయడం సరి కాదన్నారు. సంఘం రద్దు వల్ల యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పడం వాస్తవం కాదని పేర్కొన్నారు. షాపులను టెండర్ల ద్వారా ఇస్తే డబ్బున్నవారికే దక్కే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా షాపులను సబ్ లీజుకు ఇచ్చినట్లు తేలితే వాటిని రద్దు చేయడంపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
