సిరిసిల్లలో ఐదురోజులుగా లారీల్లోనే నూలు

సిరిసిల్లలో ఐదురోజులుగా లారీల్లోనే నూలు
  • సిరిసిల్లలో ఐదు రోజులుగా  రోడ్డుపైనే రూ. కోటి సరుకు
  • నూలు సరఫరదారుడితో  వ్యాపార సంఘ నేతకు విబేధాలు
  • బతుకమ్మ చీరల  ఉత్పత్తికి ఆటంకాలు

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. వచ్చిన నూలు లారీలను అన్​లోడ్​ చేయించకుండా ఓ వ్యాపార సంఘం నేత అడ్డుకోవడంతో ఐదు రోజులుగా రూ.కోటి విలువైన నూలు రోడ్డుపైనే లారీల్లో మూలుగుతోంది. విషయం తెలిసి ఇతర కంపెనీలు కూడా సిరిసిల్లకు నూలు సరఫరా నిలిపివేయడంతో బతుకమ్మ చీరల తయారీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓ వ్యాపార సంఘానికి, హైదరాబాద్​కు చెందిన నూలు సరఫరదారుడికి పైసల పంచాయతీ పడి సిరిసిల్లలో నూలు సరఫరాను నిలిపివేశారు. బతుకమ్మ చీరల తయారీ కోసం రూ. కోటి విలువైన నూలు, ముడిసరుకులు ఆరు లారీల్లో సిరిసిల్లకు రాగా ఇవి అన్​లోడ్​ చేయడం లేదు. అన్​లోడ్​ చేయడానికి వెళ్లిన హమాలీలను ఓ వ్యాపారం సంఘం నేత ఆపివేసినట్లు సమాచారం. దీంతో మ్యాక్​ సంఘాలకు నూలు అందక ఉత్పత్తికి ఇబ్బందులు
ఎదువుతున్నాయి.

గుడ్​విల్​ వివాదం

నూలు లారీలు సిరిసిల్ల వచ్చినపుడు గత కొన్నేళ్లుగా ఒక్కో లారీకి కొంత గుడ్​విల్​గా సంఘానికి ఫండ్​ జమ చేసేవారు. ఈ ఫండ్​హైదరాబాద్​కు చెందిన నూలు సరఫరదారుడు ఇవ్వలేదు. దీంతో సిరిసిల్ల వచ్చిన లారీల్లోని నూలును ఆన్​లోడ్​ చేయవద్దని హమాలీలకు ఓ వ్యాపార సంఘం నాయకుడు చెప్పినట్లు సమాచారం. దీంతో మ్యాక్​ సంఘాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు లారీలు అన్​లోడ్​ చేయకుండా సిరిసిల్లలో నిలిపివేశారని తెలిసి మిగతా కంపెనీల నిర్వాహకులు కూడా సిరిసిల్లకు నూలు పంపించడం ఆపేసినట్లు మ్యాక్​ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఉత్పత్తి కొన్ని సంఘాల్లో నిలిచిపోయిందని, మరికొన్ని సంఘాల్లో రెండు రోజుల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. నూలు సరఫరదారుడితో విబేధాలు ఉంటే ఆయనను పిలిపించి మాట్లాడుకోవాలి తప్ప ఇలా చీరల ఉత్పత్తికి ఆటంకం కలిగించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైన చేనేత జౌళిశాఖ అధికారులు కల్పించుకుని సమస్యను పరిష్కరించాలని, నూలు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మ్యాక్​ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

నా దృష్టికి రాలేదు

సిరిసిల్లకు వచ్చిన నూలు లారీలను అన్​లోడ్​ చేయకుండా ఐదు రోజులుగా ఉంచుతున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. అయినా అది కంపెనీ, వ్యాపారులకు సంబంధించిన విషయం. కానీ ఈ సమస్య బతుకమ్మ ఉత్పత్తికి ఆటంకం కలిగించేలా ఉంటే విచారణ జరిపి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.

           – ఆశోక్​రావ్, చేనేత జౌళి శాఖ ఏడీ, రాజన్నసిరిసిల్ల