స్టేట్​​లో జోరందుకున్న యాసంగి సాగు

స్టేట్​​లో జోరందుకున్న యాసంగి సాగు
  • 26.85 లక్షల ఎకరాల్లో వరి నాట్లు  
  • మిగతా పంటలన్నీ అంతంతే
  • వ్యవసాయ శాఖ రిపోర్ట్​లో వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్టేట్​​లో యాసంగి సాగు జోరందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్దఎత్తున వరి నాట్లు వేస్తున్నారు. పంట పొలాల్లో రైతులు, కూలీలు వరినాట్లు వేస్తూ బిజీగా కనిపిస్తున్నారు. ఈ సీజన్‌‌‌‌లో పెద్ద  ఎత్తున నాట్లు పడే పరిస్థితి కనిపిస్తోంది. రైతాంగం ఇప్పటికే 26.85 లక్షల ఎకరాలకు పైగా వరి నాట్లు వేసినట్లు వ్యవసాయశాఖ రిపోర్ట్​లో వెల్లడైంది. 32 జిల్లాల్లో 38.53 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు జరుగగా.. అందులో  వరి 70 శాతం వేసినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వానాకాలాన్ని మించనున్న వరి సాగు

రాష్ట్రంలో యాసంగి సాధారణ సాగు 47.58 లక్షల ఎకరాలు. ఇందులో వరి 33.53 లక్షల ఎకరాల్లోనే ఉండేది. కానీ, గత మూడు నాలుగేళ్లుగా వరి పొలాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. నిరుడు సర్కారు.. యాసంగిలో వరి వద్దన్నప్పటికీ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 35.84 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఈసారి ఇప్పటి వరకు సర్కార్ ఎలాంటి​ ఆంక్షలు ప్రకటించకపోవడంతో నాట్లు జోరుగా వేస్తున్నారు. 2020–21 యాసంగిలో అత్యధికంగా  52.78 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అప్పట్లో సర్కారు 90.22 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. గత వానాకాలంలోనూ  రైతులు 64.54 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక వరి సాగుగా రికార్డ్​ అయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి యాసంగిలో వరి వానాకాలం సీజన్​ను మించి సాగయ్యే అవకాశాలు ఉన్నాయని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నారు. ఈయేడు  సర్కారు కొనుగోళ్లు చేపడితే నష్టమేమి ఉండదని  రైతులు అంటున్నరు.

4 లక్షల ఎకరాల్లో మక్కలు..

యాసంగి సీజన్​లో వరి తప్ప మిగతా పంటలు అంతంత మాత్రంగానే సాగయ్యాయి. మక్కలు 4 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. శనగలు 3.35 లక్షల ఎకరాల్లో వేశారు. పల్లి పంట 2.13 లక్షల ఎకరాల్లో సాగైనట్లు అగ్రికల్చర్‌‌‌‌ డిపార్ట్​మెంట్​ నివేదికలో స్పష్టమైంది.

నిజామాబాద్‌‌‌‌ టాప్‌‌‌‌

ఈ సీజన్‌‌‌‌లో పంటల సాగులో నిజామాబాద్‌‌‌‌ జిల్లా టాప్‌‌‌‌లో నిలిచింది. ఇప్పటికే ఆ జిల్లా యాసంగి సాధారణ సాగు 4.03 లక్షల ఎకరాలను మించిపోయింది. మొత్తం 4.09 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 3.18 లక్షల ఎకరాల్లో వరి వేశారు.  ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే, కామారెడ్డి జిల్లాలో 3.46 లక్షల ఎకరాల్లో, నల్గొండలో 3.37 లక్షల ఎకరాలు, జగిత్యాలలో 2.55 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 2.47 లక్షల ఎకరాలు, కరీంనగర్‌‌‌‌లో 2.10 లక్షల ఎకరాలు, యాదాద్రిలో 1.94 లక్షల ఎకరాలు, సిద్దిపేటలో 1.41లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. అత్యల్పంగా మేడ్చల్‌‌‌‌ జిల్లాలో 5,441 ఎకరాల్లో, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 9,398 ఎకరాల్లో, ములుగులో 10,273 ఎకరాల్లో మాత్రమే యాసంగి సాగు నమోదైంది.