IND vs ENG 2025: సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. 200కు చేరిన టీమిండియా ఆధిక్యం

IND vs ENG 2025: సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. 200కు చేరిన టీమిండియా ఆధిక్యం

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ఎంతో ఒత్తిడి తట్టుకొని జైశ్వాల్ ఈ సెంచరీ నమోదు చేయడం విశేషం. ఇన్నింగ్స్ 51 ఓవర్ రెండో బంతికి అట్కిన్సన్ బౌలింగ్ లో సింగిల్ తీసి 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ సిరీస్ లో జైశ్వాల్ కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ గా తన టెస్ట్ కెరీర్ లో ఆరవది. నాలుగు సెంచరీలు ఇంగ్లాండ్ పైనే చేయడం విశేషం. 127 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైశ్వాల్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. 

Also Read :  రోహిత్ శర్మ బిగ్ సర్‌ప్రైజ్.. ఓవల్ టెస్టుకు వచ్చిన హిట్ మ్యాన్

జైశ్వాల్ తో పాటు రెండో ఇన్నింగ్స్ లో నైట్ వాచ్ మెన్ ఆకాష్ దీప్ (66) రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యం 201 పరుగులకు చేరింది. ప్రస్తుతం భారత్ మూడో రోజు లంచ్ తర్వాత నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. క్రీజ్ లో జైశ్వాల్ (104), కరుణ్ నాయర్ (12) ఉన్నారు. చేతిలో 6 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ భారత్ వైపే ఉంది. లంచ్ తర్వాత కెప్టెన్ గిల్ (11) తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ తో కలిసి జైశ్వాల్ భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ రెండు వికెట్లు తీసుకోగా.. టంగ్, ఓవర్దన్ లకు తలో వికెట్ లభించింది. 

ప్రధాన ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ లేకపోవడంతో ఇంగ్లాండ్ కు మైనస్ గా మారనుంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే జట్టు బౌలింగ్ బాధ్యతలు మోస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది.