ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న జైస్వాల్..ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 13 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ సెంచరీ నమోదు చేశాడు.
కేఎల్ రాహుల్ రికార్డు బద్దలు
ఈ ఐపీఎల్ లో యశస్వీ జైస్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఏప్రిల్ 30వ తేదీన ముంబై ఇండియన్స్ పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన జైస్వాల్...తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ పై తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరఫున రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
ఆరంభం నుంచే..
150 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన యశస్వీ జైస్వాల్...నితీశ్ రానా వేసిన తొలి ఓవర్లోనే దంచికొట్టాడు. ఆ ఓవర్లలో వరుసగా 6,6,4,4,0,4 బాదాడు. దీంతో తొలి ఓవర్లోనే 26 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హర్షిత్ రానా వేసిన రెండో ఓవర్లోనూ ఇదే జోరుతో బ్యాటింగ్ చేశాడు. ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టాడు. ఇక శార్ధూల్ ఠాకూర్ వేసిన 3వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఓ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.