ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ముందంజ

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ముందంజ

అమరావతి, వెలుగు: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లోని పంచాయతీలకు మంగళవారం బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాయి. మధ్యాహ్నం 3.30 పోలింగ్ పూర్తికాగా.. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు వెలువడుతున్న రిజల్ట్​లో అక్కడక్కడా టీడీపీ క్యాండిడేట్స్ గెలవగా.. ఎక్కువ పంచాయతీల్లో వైసీపీ క్యాండిడేట్స్ విజయం సాధించారు. కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లోనూ వైసీపీ ఆధిక్యం కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో 106 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందగా.. ఆరు పంచాయతీల్లో టీడీపీ బలపరిచన క్యాండిడేట్స్ గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం బొబ్బనపల్లిలో జనసేన సర్పంచ్ అభ్యర్తి 3 ఓట్లతో ఓడిపోయారు. దీంతో రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేయగా అధికారులు అందుకు అంగీకరించకపోవడంతో ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం చావావారిపాలెం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన కే జ్యోతికి సున్నా ఓట్లు వచ్చాయి. ఎన్నికల హడావుడిలో పడి సర్పంచి అభ్యర్థి తన ఓటు కూడా వేరే అభ్యర్థికి వేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా పిడపర్తిపాలెం సర్పంచిగా కరుణశ్రీ ఎన్నికయ్యారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆమె గెలుపు సాధించారు. మరోవైపు  కృష్ణా జిల్లా కంకిపాడులోనూ వైసీపీ మద్దతుదారుడు బైరెడ్డి నాగరాజు ఒకే ఓటు తేడాతో సక్సెస్ కొట్టాడు.