యాదగిరిగుట్టలో వేద పాఠశాల..కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన

యాదగిరిగుట్టలో వేద పాఠశాల..కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన

 

 
  • రూ.99.55 కోట్లతో  వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం
  •     కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌‌ రెడ్డి

    యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్‌‌ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి ఉదయం 9.37 గంటలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. వేదపాఠశాలతో పాటు రూ. 99.55 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సైతం సీఎం రేవంత్‌‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. 

 యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌‌ రెడ్డి మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌‌ నుంచి హెలికాప్టర్‌‌లో బయలుదేరారు. ఉదయం 8.45 గంటలకు యాదగిరిగుట్టలోని టెంపుల్ సిటీకి చేరుకున్నారు. హెలీప్యాడ్‌‌ నుంచి క్యారవాన్‌‌లోకి వెళ్లిన సీఎం సంప్రదాయ దుస్తులు ధరించిన అనంతరం శంకుస్థాపన జరిపే ప్రదేశానికి చేరుకున్నారు.

 శంకర విజయేంద్ర సరస్వతీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ చేశారు. అనంతరం కొండపైన చేపట్టే కల్యాణ మండపం, దీక్షాధారుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, ప్రధానాలయ వాయువ్య దిశలో ఏర్పాటు చేసే మెట్ల మార్గం కోసం వేద పాఠశాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన శిలాఫలకాలను మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌‌ ఆవిష్కరించారు. 

నారసింహుడిని దర్శించుకున్న రేవంత్‌‌ రెడ్డి

వేద పాఠశాల, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్‌‌ రెడ్డి రోడ్డు మార్గంలో కొండపైకి చేరుకున్నారు. ప్రధానాలయ తూర్పు రాజగోపురం నుంచి త్రితల గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించిన సీఎం రేవంత్‌‌ రెడ్డికి ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

ముందుగా ఆంజనేయస్వామికి, గర్భగుడికి అభిముఖంగా ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్ద సీఎం పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోకి వెళ్లి స్వయంభు నారసింహుడిని దర్శించుకున్నారు. ప్రధానాలయ ముఖ మంటపంలో అర్చకులు సీఎం రేవంత్‌‌ రెడ్డికి చతుర్వేద ఆశీర్వచనం చేయగా.. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్, చైర్మన్‌‌ నరసింహమూర్తి కలిసి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, నారసింహుడి విగ్రహాలను బహూకరించారు. 

అనంతరం తిరిగి రోడ్డు మార్గంలో టెంపుల్‌‌ సిటీలోని హెలిప్యాడ్‌‌ వద్దకు చేరుకున్న సీఎం 10.56 గంటలకు హెలికాప్టర్‌‌లో హైదరాబాద్‌‌కు తిరుగు పయనం అయ్యారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌‌కుమార్‌‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌‌లు బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌‌కుమార్‌‌ రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎండోమెంట్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్‌‌ కలెక్టర్లు భాస్కరరావు, వెంకారెడ్డి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్‌‌, ధార్మిక అడ్వైజర్‌‌ రామ్మూర్తి గోవింద హరి తదితరులు పాల్గొన్నారు.