మా ప్రాబ్లమ్స్ .. మా మేనిఫెస్టో.. గ్రేటర్ సిటీ కాలనీల అసోసియేషన్ల నిర్ణయం

మా ప్రాబ్లమ్స్ .. మా మేనిఫెస్టో.. గ్రేటర్ సిటీ కాలనీల అసోసియేషన్ల నిర్ణయం

రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి ఇబ్బందులతో సతమతం  
ప్రధాన సమస్యలపై ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు
అన్నిపార్టీల అభ్యర్థులకు అందజేసేందుకు సిద్ధం
పరిష్కరించేవారికే మద్దతు ఇవ్వనున్న కాలనీవాసులు

హైదరాబాద్, వెలుగు: ఏళ్లు గడుస్తున్నా కాలనీల్లో  సమస్యలను పరిష్కరించడం లేదు.  ఎవరికి చెప్పినా పట్టించుకునే వారే లేరు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, కుక్కలు, ఇలాంటి  సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రజాప్రతినిధులు మారుతున్నా పరిస్థితుల్లో మార్పులేదు.’’ అంటూ గ్రేటర్ హైదరాబాద్ లోని కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వందలాది కాలనీల్లో పార్కులు సరిగా లేవని పేర్కొంటున్నాయి. ఎన్నికల సమయంలోనే నేతలు వస్తున్నారని, ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటున్నాయి. ఈసారి పనులు చేస్తారనే నమ్మకం ఉన్న వారివైపే కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.

ఇందుకు కాలనీల్లోని సమస్యలను పరిష్కరించేందుకు అసోసియేషన్ల సభ్యులు ప్రత్యేకంగా మేనిఫెస్టోను తయారు చేశారు. అన్ని కాలనీల్లో ఏయే సమస్యలు ఉన్నాయనే వివరాలను ఇప్పటికే యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(యుఫెర్వాస్) సేకరించింది. గ్రేటర్ లోని 4,300 కాలనీల నుంచి వివరాలు తీసుకున్నట్టు సభ్యులు చెప్పారు. ఇందులో ప్రధానంగా 10 సమస్యలను మేనిఫెస్టోగా తయారు చేసి గ్రేటర్ లోని 25 సెగ్మెంట్లలోని బీఆర్ఎస్, కాంగ్రెస్​, బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు కాగానే వారికి అందజేయనున్నట్టు వెల్లడించారు.  

రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నా...

జీహెచ్ఎంసీ పరిధిలో  మొత్తం 938 పార్కులకు.. ఇందులో 19 మేజర్ , కాలనీలకు చెందినవి 919 ఉన్నాయి.  వందకుపైగా పార్కులు  జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా.. మరి కొన్ని కాంట్రాక్టర్లకు అప్పగించింది. మిగతా 722 పార్కుల మెయింటెనెన్స్  సంబంధిత  కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లకు ఇచ్చింది.  వీటి నిర్వహణకు జీహెచ్ఎంసీ ప్రతి ఏటా రూ.15 కోట్లను ఖర్చు చేస్తుంది. మెయింటెనెన్స్  ఖర్చులో 75 శాతం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకు  జీహెచ్ఎంసీ ఫండ్స్ ను అందిస్తుంది.

అవి టైమ్ కు  ఇవ్వడంలేదని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.  కాగా..  జీహెచ్ఎంసీ రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నప్పటికీ వాకర్స్ కు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. కొన్ని పార్కుల్లో వాకింగ్ ట్రాక్ లు సక్రమంగా లేవు. చెత్తా చెదారంతో నిండిపోయాయి. కొన్ని పార్కుల గోడలు కూలిపోయినా పట్టించుకోవడంలేదు. కొన్నేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉందని కాలనీల వాసులు చెబుతుండగా.. పార్కుల్లోని సమస్యల కారణంగా రోడ్లపై వాకింగ్ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నిసార్లు వెళ్లి కలిసినా..

ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత పనులు చేయడంలేదు. ఎన్నిసార్లు అడిగినా రేపు, మాపంటూ తిప్పుకుంటూ చివరకు దాటవేస్తున్నారు. కొందరైతే అధికారులకు చెప్పామని, వెంటనే పనులు పూర్తవుతాయని చెబుతున్నా కూడా తీరడంలేదు. నేతలు ఇలా చేస్తుండగా యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేనిఫెస్టో నిర్ణయం తీసుకుంది. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులకు అందజేసి తమ పార్టీల మేనిఫెస్టోల్లో పెట్టాలని కోరుతున్నారు. ఆయా పార్టీలకే మద్దతు తెలుపుతామని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేస్తుండగా అన్ని పార్టీలు ఆయా సమస్యలపై దృష్టి పెట్టే చాన్స్ ఉంది. 
 
ఎన్నికలప్పుడే నేతలు వస్తుండగా.. 

ఎన్నికలప్పుడే లీడర్లు వస్తుండగా కాలనీల్లో చాలామందికి తమ డివిజన్ కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలియదు. మహిళల్లోనైతే సగానికిపైగా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేతలు కనిపించడంలేదని,  ఏవైనా సమస్యలపై స్థానిక లీడర్లను కలుద్దామని వెళ్తే ఏదో ఒక సాకు చెప్పి పట్టించుకోవడంలేదు. ఇక ఎన్నికలప్పుడే లీడర్లు వస్తుండగా వారి బాటలోనే వెళ్లాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు నిర్ణయించుకున్నాయి. ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే తమ సమస్యలను పరిష్కరిస్తామని పార్టీల మేనిఫెస్టోలో  పొందుపర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.  గ్రేటర్ లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు తమ డిమాండ్లను మేనిఫెస్టోగా అందించనున్నాయి. 

సిటిజన్ మేనిఫెస్టోని అందజేస్తం

సిటీలోని కాలనీల్లో ప్రధాన సమస్యలపై తయారు చేసిన మేనిఫెస్టోను అన్నిపార్టీల అభ్యర్థులకు అందజేస్తం. గెలిచిన తర్వాత కాలనీల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతం. తద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నం.  గ్రేటర్ లోని అన్ని కాలనీల్లో ఏయే  సమస్యలు ఉన్నాయనే వివరాలను తీసుకుని సిటిజన్స్ మేనిఫెస్టోని రూపొందించినం. వచ్చేవారం నుంచి అభ్యర్థులను కలుస్తం. 

బీటీ శ్రీనివాసన్, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రెసిడెంట్