తెలంగాణలో యూరియా వాడకం డబుల్‌‌!.. గత పదేండ్లలో రెట్టింపైన వినియోగం

తెలంగాణలో  యూరియా వాడకం డబుల్‌‌!.. గత పదేండ్లలో  రెట్టింపైన  వినియోగం
  •     ఈ సారి 22 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా
  •     ఇప్పటికే 16 లక్షల టన్నుల వినియోగం 
  •     అవసరానికి మించి యూరియా వాడకంతో నష్టమే 
  •     నేల నిస్సారమవుతుందంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో యూరియా వినియోగం ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నది. గత పదేళ్లలో వాడకం రెండింతలు అయింది. దీంతో నేలలు సారం కోల్పోతున్నాయని, భవిష్యత్​లో ఆహార ముప్పు తప్పదని అగ్రికల్చరల్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014–15లో యూరియా వినియోగం 10.50 లక్షల టన్నులు కాగా, 2024–25 నాటికి 20.08 లక్షల టన్నులకు పెరిగింది. 2025–26 అగ్రికల్చర్​ ఇయర్​లో ఇప్పటికే 16 లక్షల టన్నులు వినియోగం జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. యాసంగిలో ఇప్పటికే 4 లక్షల టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. సంక్రాంతి తరువాత వరి నాట్లు జోరందుకోనున్నాయి. 


ఆ తర్వాత యూరియా వినియోగం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ సారి యాసంగిలో మక్కల సాగు భారీగా పెరిగింది. ఇప్పటికే 5.76 లక్షల ఎకరాల్లో రైతులు మక్క సాగుచేశారు. ఇది గతేడాది కన్నా లక్ష ఎకరాలు ఎక్కువ కావడం గమనార్హం. దీనికి తోడు వరి కూడా ఇప్పటికే 6 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇది గతేడాది కన్నా రెండు లక్షల ఎకరాలు ఎక్కువ. యాసంగి సాగు బుధవారం నాటికి 17 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంతో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో పశువుల పేడ, ఇంటి పెంట, ఇతర సేంద్రియ ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, కేవలం యూరియాపైనే ఆధారపడ్తున్నారని, ఒక బస్తా వేయాల్సిన చోట మూడు, నాలుగు బస్తాలు గుమ్మరిస్తున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యూరియా వేయగానే చేను పచ్చగా కనిపిస్తుందని, అందుకే రైతులు ఒకరిని మించి ఒకరు యూరియా వాడుతున్నారని, ఇది తాత్కాలిక ప్రయోజనం కలిగించినా, దీర్ఘకాలంలో నేలంతా నిస్సారమై, ఎలాంటి పంటలు పండని ప్రమాదకర పరిస్థితి వస్తుందని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్చరిస్తున్నారు.

ఎకరానికి 170 కిలోల యూరియా..

రాష్ట్రంలో రైతులు పరిమితికి మించి యూరియా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎకరానికి సగటున 100-–120 కిలోల యూరియా వాడకం ఉండగా, తెలంగాణలో ఇది 170 కిలోలకు చేరింది.  యూరియా ధర తక్కువగా ఉండడం,  ఎంత యూరియా వేస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుందనే ఆపోహ వల్లే  రైతులు అవసరానికి మించి వాడుతున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా ఏటా ఒక ఎకరాకు 90–100 కిలోల యూరియా సరిపోతుంది. కానీ మన దగ్గర రెట్టింపు మొత్తంలో చల్లుతున్నారని, దీంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్తున్నారు.

ఎకరానికి 170 కిలోలు..

రాష్ట్రంలో రైతులు పరిమితికి మించి యూరియా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల యూరియా వాడకం ఉండగా, తెలంగాణలో ఇది 170 కిలోలకు చేరింది.  యూరియా ధర తక్కువగా ఉండడం,  ఎంత యూరియా వేస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుందనే ఆపోహ వల్లే  రైతులు అవసరానికి మించి వాడుతున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా ఏటా ఒక ఎకరాకు 90-100 కిలోల యూరియా సరిపోతుంది. కానీ మన దగ్గర రెట్టింపు మొత్తంలో చల్లుతున్నారని, దీంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని, భూములన్నీ చౌడుగా మారుతున్నాయని చెప్తున్నారు.

అధిక యూరియా వల్ల పూత, కాత లేట్..

యూరియాలో 46 శాతం నత్రజని ఉండడంతో నీటిలో తేలికగా కరిగి వెంటనే పైరు పచ్చబడుతుంది. కానీ అధిక మోతాదులో వాడడం వల్ల మొక్క ఎదుగుదల బాగున్నప్పటికీ పూత, కాత లేటవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ‘మొక్కలు చిక్కని ఆకుపచ్చ రంగులోకి మారడంతో చీడపీడల బెడద పెరుగుతుంది. పంట గింజల నాణ్యత తగ్గి తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉంది’ అని వివరిస్తున్నారు. మొక్కలకు నత్రజని చివరి వరకూ అవసరమని, అందువల్ల ఒకేసారి పెద్దమొత్తంలో వేయకుండా వరి నాటు పడ్డాక,  పిలక దశలో, చిరు పొట్ట దశలో .. ఇలా దశలవారీగా కొద్దికొద్దిగా వేయాలని సూచిస్తున్నారు. యూరియాతో పాటు వేప పిండి కలిపి వేస్తే నత్రజని అందుబాటు పెరగడమే కాక చీడపీడల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తున్నారు. ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉండే యూరియాను అధిక మోతాదులో వేయడం వల్ల  భూముల్లో ఆమ్ల స్వభావం పెరిగి, నేల చౌడుబారి పోతుందని, అందువల్ల సేంద్రియ కర్బనం పెంచుకునే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. 

యూరియా వాడకం..

(ఏడాది వారీగా లక్షల టన్నుల్లో)
2016-17    15.50  
2017-18    14.02  
2018-19    13.75 
2019-20    16.11 
2020-21    18.21 
2021-22    18.68 
2022-23    19.15 
2023-24    19.62 
2024-25    20.08