- సొంత మెటీరియల్ వాడితే చర్యలు తప్పవని హెచ్చరిక
- ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే మార్కెట్లోకి కొత్త పుస్తకాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ఇంటర్ ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ‘తెలుగు అకాడమీ’ ముద్రించిన పుస్తకాలనే వాడేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ విషయంపై గతంలోనే ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి కఠినంగా అమలు చేసేందుకు రెడీ అవుతున్నది. కాలేజీల మేనేజ్మెంట్లు సొంత, ప్రైవేట్ మెటీరియల్స్టూడెంట్లపై రుద్దితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 3,300లకు పైగా జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో పది లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
వీటిలో 1,463 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లోనే ఏడు లక్షల మంది ఉన్నారు. మిగిలిన మూడు లక్షల మంది సర్కారు, సర్కారు సెక్టార్ కాలేజీల్లో చదువుతున్నారు. అయితే, ప్రస్తుతం కేవలం గవర్నమెంట్ సెక్టార్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే తెలుగు అకాడమీ పుస్తకాలను అందిస్తున్నారు. కొన్ని ప్రైవేటు కాలేజీలు మాత్రమే తెలుగు అకాడమీ బుక్స్ వాడుతుండగా, ఇంకొన్ని కాలేజీలు ఈ పుస్తకాల్లోని కంటెంట్‌ను ప్రైవేటుగా ముద్రించుకొని విద్యార్థులకు అందిస్తున్నాయి.
ఇక కార్పొరేట్ కాలేజీల పిల్లలకు తెలుగు అకాడమీ బుక్స్ ఇవ్వకుండా స్టడీ మెటీరియల్ పేరుతో సిలబస్ ను ప్రింట్ చేయించి ఇస్తున్నాయి. తమ సొంత పబ్లికేషన్స్, ప్రైవేట్ ఆథర్స్ రాసిన పుస్తకాలను స్టూడెంట్లకు అంటగడుతున్నాయి. దీంతో సిలబస్‌లో గందరగోళం ఏర్పడటమే కాకుండా, పేరెంట్స్ పైనా భారీగా ఆర్థిక భారం పడుతున్నది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఇంటర్ బోర్డు.. ఇకపై ఆ దందాలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది.
అన్ని బుక్స్ కొత్తగానే..
సైన్స్ గ్రూపులైనా, హ్యూమానిటీస్ అయినా.. అకాడమీ ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్సే స్టాండర్డ్ అని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను రిఫరెన్స్‌గా వాడుకోవచ్చేమో కానీ, వాటినే టెక్స్ట్ బుక్స్‌గా స్టూడెంట్లకు అంటగట్టడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. అకాడమీ పుస్తకాల్లోని కంటెంట్, సిలబస్ మాత్రమే ప్రామాణికం కాబట్టి, దాన్నే క్లాస్ రూమ్స్‌లో బోధించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
వచ్చే విద్యాసంవత్సరం ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టుల సిలబస్ మార్పులు చేస్తున్నారు. దీంతో కేవలం అకాడమీ బుక్స్ మాత్రమే వినియోగించేలా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాటికి మార్కెట్లో ఇంటర్ పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. దీనికోసం ఇప్పటికే కొత్త సిలబస్‌ను ఇంటర్ బోర్డు రెడీ చేయగా, త్వరలోనే వీటిని ప్రింటింగ్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
