యూరియా సరఫరా, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష

యూరియా సరఫరా, నిల్వలపై  అప్రమత్తంగా ఉండాలి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష
  •     అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో యూరియా సరఫరా, నిల్వల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైనన్ని ఎరువులు సమయానికి అందుబాటులో ఉంచాలని సూచించారు. 

ఈ మేరకు గురువారం రాష్ట్రంలో యూరియా సరఫరా, నిల్వలపై అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, అగ్రికల్చర్ డైరెక్టర్  బి. గోపి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ సురేంద్ర మోహన్ మాట్లాడారు. జిల్లా స్థాయిలో యూరియా సరఫరా, నిల్వలను నిరంతరం తనిఖీ చేయాలన్నారు. 

సెంటర్ల వారీగా అవసరమైన మేరకు ఇండెంట్లు పెట్టి, వేగంగా స్టాక్ పాయింట్లకు చేరేలా అగ్రికల్చర్, మార్క్‌ఫెడ్, డీసీఓ, హాకా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు సేల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. 

అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్​ గోపి మాట్లాడుతూ.. అన్ని సేల్ పాయింట్లలో ముందస్తుగా అవసరమైనంత యూరియా నిల్వలు సమకూర్చుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అక్రమ మార్గంలో యూరియా అమ్మకాలు జరిపే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఈ సమావేశంలో మార్క్‌ఫెడ్, హాకా, అగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్లు, సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్‌తో పాటు అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్, హాకా, అగ్రోస్, సహకార శాఖ అధికారులు 
పాల్గొన్నారు.