తెలంగాణలో 4 రోజులు వర్షాలు

తెలంగాణలో 4 రోజులు వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శనివారం విడుదల చేసిన బులెటిన్​లో పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలు, సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.

మంగళవారం ఆయా జిల్లాలతో పాటు సిద్దిపేట, మహబూబాబాద్​, వరంగల్, హనుమకొండ జిల్లాలు, బుధవారం భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్​, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్​, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్​కర్నూల్​ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్​  జారీ చేసింది. 

టెంపరేచర్లు తగ్గుతయ్​

వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మహబూబ్​నగర్​ మినహా మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలలోపే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నది. మరోవైపు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లా కన్నయ్యపల్లి, మహబూబ్​నగర్​ జిల్లా వడ్డేమాన్​లో 40 డిగ్రీలు మినహా మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు 39  డిగ్రీలలోపే రికార్డయ్యాయి.