పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధం ప్రారంభమైన తర్వాత, యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ మొదటిసారిగా నేరుగా రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు శనివారం బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డారు.హౌతీ రెబల్స్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ, అల్ మసీరా శాటిలైట్ టెలివిజన్ ద్వారా ఈ దాడిని అధికారికంగా ప్రకటించారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులకు నిరసనగా ,ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకున్నామని సరీ చెప్పారు. ఇజ్రాయెల్ లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించినట్లు వెల్లడించారు.తమ లక్ష్యాలు నెరవేరే వరకు దాడులు ఆపబోమని స్పష్టం చేశారు.
ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత హౌతీలు ఇజ్రాయెల్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇటు ఇరాన్, అటు హమాస్, లెబనాన్‌లోని హెజ్బుల్లా..ఇప్పుడు యెమెన్‌లోని హౌతీలు - కలవడంతో అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్‌కు ముప్పు పెరుగుతోంది. ఇజ్రాయెల్,అమెరికా దళాలు గజా, లెబనాన్, ఇరాన్ వంటి ప్రతిఘటన కూటమి ఉన్న చోట్ల దాడులు నిలిపివేసే వరకు తాము కూడా వెనక్కి తగ్గమని హౌతీ ప్రతినిధి హెచ్చరించారు.
ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తం: క్షిపణిని అడ్డుకున్న ఐరన్ డోమ్
హౌతీలు ప్రయోగించిన క్షిపణులపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) స్పందించాయి. హౌతీ రెబల్స్ ప్రయోగించిన క్షిపణిని తాము గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.నిజానికి ఈ దాడి ఆకస్మికంగా జరగలేదు. మిడిల్ ఈస్ట్ దేశాలను వణికిస్తున్న ఈ యుద్ధంలో తాము కూడా భాగస్వామ్యం కాబోతున్నామని హౌతీ ప్రతినిధి యాహ్యా సరీ శుక్రవారమే పరోక్షంగా హెచ్చరించారు. సరీ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై ఈ బాలిస్టిక్ క్షిపణి దాడులు జరగడం గమనార్హం.
►ALSO READ \ "అతను నా కాళ్ల దగ్గరకు వస్తాడనుకోలేదు": సౌదీ యువరాజుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు, ముడిచమురు రవాణా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు హౌతీలు కూడా ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరిన్ని ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
