యుద్ధంలోకి హౌతీల ఎంట్రీ..తొలిసారి ఇజ్రాయెల్ పైకి యెమెన్ రెబెల్స్ మిసైళ్ల దాడి

యుద్ధంలోకి హౌతీల ఎంట్రీ..తొలిసారి ఇజ్రాయెల్ పైకి యెమెన్ రెబెల్స్ మిసైళ్ల దాడి
  •     కొత్త మలుపు తిరిగిన పశ్చిమాసియా యుద్ధం
  •     ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు చేస్తే.. మరింత చమురు సంక్షోభం 
  •     ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ అటాక్స్ 
  •     కువైట్ ఎయిర్​పోర్టుపై దాడి.. భారీగా మంటలు 
  •     సౌదీలోని యూఎస్ బేస్​పై 6 క్షిపణులు, 29 డ్రోన్లతో దాడి
  •     15 మంది అమెరికా సైనికులకు గాయాలు 
  •     ఇరాన్‌‌లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌‌ దాడులు

టెహ్రాన్‌‌/టెల్ అవీవ్: పశ్చిమాసియా యుద్ధం కొత్త మలుపు తిరిగింది. నెల రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ మౌనంగా ఉన్న యెమెన్‌‌కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ రెబెల్స్.. శనివారం తొలిసారిగా ఇజ్రాయెల్‌‌పై నేరుగా దాడికి దిగారు. యెమెన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొద్దిసేపటికే, ఈ దాడికి తామే బాధ్యులమని హౌతీలు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తమ మిత్రదేశమైన ఇరాన్‌‌పై దాడులు కొనసాగినా.. లేదా ఇతర దేశాలు ఈ యుద్ధంలో జోక్యం చేసుకున్నా తాము చూస్తూ ఊరుకోబోమని హౌతీలు గతంలోనే హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ.. ఉత్తర యెమెన్‌‌ను తమ ఆధీనంలో ఉంచుకున్న ఈ గ్రూపు, శనివారం ఇజ్రాయెల్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీనికి సంబంధించి హౌతీ ప్రతినిధి యాహ్యా సరీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ప్రకటనను విడుదల చేస్తూ, దాడుల విషయాన్ని ధ్రువీకరించారు. కాగా, ఇజ్రాయెల్ భూభాగం వైపు యెమెన్ నుంచి క్షిపణి వస్తున్నట్టు గుర్తించిన వెంటనే తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. క్షిపణిని గాలిలోనే అడ్డుకోవడంతో ఇజ్రాయెల్‌‌లో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలుస్తున్నది. 

 గతంలో గాజా యుద్ధ సమయంలో పాలస్తీనాకు సంఘీభావంగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మార్గాల్లో వెళ్లే వాణిజ్య నౌకలపై హౌతీలు విరుచుకుపడ్డారు. ప్రస్తుత యుద్ధంలో ఇప్పటివరకూ వారు నౌకలపై దాడులకు దూరంగా ఉన్నప్పటికీ, తాజా పరిణామాలతో మళ్లీ అశాంతి మొదలైంది.  ఇరాన్ ఇప్పటికే ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌‌’ను దాదాపు మూసివేసి, గల్ఫ్ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో సౌదీ  తన చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగాన్ని ‘యన్బు’   ఓడరేవుకు తరలిస్తున్నది. ఇప్పుడు ఎర్ర సముద్రం ప్రాంతంలో హౌతీలు దాడులకు దిగితే, ప్రపంచ ఇంధన మార్కెట్ మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అణు కేంద్రాలే లక్ష్యంగా అటాక్‌‌

ఇజ్రాయెల్‌‌పై ఇరాన్, హెజ్బొల్లా నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తున్నాయి.  బీర్ షెబా నగరం, ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం సమీపంలో శనివారం మూడోసారి హెచ్చరిక సైరన్లు మోగాయి. దీనికి ప్రతిచర్యగా..ఇరాన్‌‌లోని అణు కేంద్రాలపై  ఇజ్రాయెల్ దాడులు చేసింది. అరక్ వద్ద ఉన్న ‘షాహిద్ ఖొండాబ్’ భారీ నీటి సముదాయం, యాజ్ద్ ప్రావిన్స్‌‌లోని ‘అర్దాకాన్’ ఎల్లోకేక్ ఉత్పత్తి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ అణు శక్తి సంస్థ ధ్రువీకరించింది. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని, రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ పేర్కొన్నది. 

సౌదీలో అమెరికా బలగాలపై దాడులు

ఇజ్రాయెల్‌‌కు మద్దతు ఇస్తున్న అమెరికా సైన్యం లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. సౌదీ అరేబియాలోని ‘ప్రిన్స్ సుల్తాన్’ ఎయిర్ బేస్‌‌పై ఇరాన్ 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 15 మంది అమెరికా సైనికులు గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన వారం రోజుల్లో ఈ బేస్‌‌పై దాడులు జరగడం ఇది మూడోసారి. ఇప్పటివరకూ మొత్తం 24 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. యుద్ధం కారణంగా ఇరాన్‌‌లో సుమారు 82 వేల పౌర భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని యూఎన్‌‌వో వెల్లడించింది. సుమారు 1.80 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నది.

కువైట్ ఎయిర్​పోర్టుపై డ్రోన్ దాడులు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వరుస డ్రోన్ దాడుల్లో అక్కడి రాడార్ వ్యవస్థ దెబ్బతింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ దాడులను ఇరాన్, దాని ప్రాక్సీలు, సాయుధ వర్గాలే చేశాయని కువైట్ పౌర విమానయాన శాఖ ప్రతినిధి తెలిపారు. అమెరికా-, ఇరాన్ ఘర్షణల వల్ల కువైట్, బహ్రెయిన్ లోని ప్రధాన విమానాశ్రయాలు బంద్ అయి, వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఇది ప్రయాణికులనే కాకుండా వాణిజ్యం, సరఫరా గొలుసులపై కూడా ప్రభావం చూపుతోంది. 

పెరుగుతున్న మరణాల సంఖ్య

యుద్ధంలో ప్రాణనష్టం భారీగా పెరుగుతున్నది. ఇప్పటివరకు లెబనాన్‌‌లో 1,100 మందికిపైగా, ఇరాన్‌‌లో 1,900 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్‌‌లో 19 మంది పౌరులు, నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మృతిచెందారు. 

నరకానికి స్వాగతం!

ఇరాన్ భూభాగంపై అడుగుపెట్టే అమెరికా సైనికులు శవపేటికల్లోనే తిరిగి వెళ్తారని ఇరాన్ ఇంగ్లీష్ పత్రిక 'టెహ్రాన్ టైమ్స్' హెచ్చరించింది. పశ్చిమాసియాకు అమెరికా మరో 10 వేల అదనపు బలగాలను తరలిస్తోందని, ఇరాన్ పై భూతల దాడికి సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్ టైమ్స్ ఈ మేరకు తన స్పెషల్ ఎడిషన్ లో అమెరికన్ సోల్జర్ల ఫొటోపై ‘మా గడ్డపై దిగే అమెరికన్ సోల్జర్లు శవపేటికల్లోనే తిరిగి వెళ్తారు’ అంటూ క్యాప్షన్ పెట్టి వార్నింగ్ ఇచ్చింది.