నచ్చిన మాంసం కొనుక్కోవచ్చు.. అందుబాటులోకి పీ మార్ట్

నచ్చిన మాంసం కొనుక్కోవచ్చు.. అందుబాటులోకి పీ మార్ట్
  • నచ్చిన గొర్రె, మేక మాంసం కొనుక్కోవచ్చు
  • అందుబాటులోకి రానున్న పీ మార్ట్ 
  • పోర్టబుల్ స్లాటర్‌‌ను రూపొందించిన ఎన్ఆర్‌‌సీఎం 
  • 31న ప్రారంభించనున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

హైదరాబాద్‌‌, వెలుగు: చికెన్‌‌ షాపుకు వెళ్లి నచ్చిన కోడిని కొనుక్కొని కట్‌‌ చేయించుకున్నట్లు.. మటన్‌‌ కూడా కొనుక్కునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇక నుంచి నచ్చిన గొర్రెనో, మేకనో కట్‌‌ చేయించుకొని మటన్‌‌ తీసుకెళ్లొచ్చు. ఇందుకోసం హైదరాబాద్‌‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్‌‌ మీట్‌‌ (ఎన్ఆర్‌‌సీఎం) ఆధునిక టెక్నాలజీతో పోర్టబుల్‌‌ స్లాటర్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 31న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌‌ తోమర్‌‌ ఢిల్లీ నుంచి ఆన్‌‌లైన్‌‌ ద్వారా దీన్ని ప్రారంభించనున్నారు. సిటీలకు దూరంగా స్లాటర్ హౌస్ లు ఉండడంతో నాణ్యమైన మాంసం ప్రజలకు అందట్లేదని సర్కార్ భావిస్తోంది. మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా కోసి అమ్ముతున్నారు. ఇక హైదరాబాద్‌‌ లో విక్రయించే మటన్ నాణ్యత ప్రశ్నార్థకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏరియాలోనూ ఈ పోర్టబుల్‌‌ స్లాటర్‌‌ను అందుబాటులోకి తేవడం ద్వారా నాణ్యమైన మాంసం అందుతుందని ఎన్‌‌ఆర్‌‌సీఎం సీనియర్‌‌ సైంటిస్ట్‌‌ రామకృష్ణ తెలిపారు. 

అసలేంటీ పీ మార్ట్..
పోర్టబుల్‌‌ మీట్‌‌ ప్రొడక్షన్‌‌, రిటైల్ మార్ట్‌‌ను పీ మార్ట్‌‌ పేరుతో ఎన్‌‌ఆర్‌‌సీఎం రూపొందించింది. పట్టణాలు, పల్లెల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి నాణ్యమైన మాంసం అందించాలనే లక్ష్యంతో దీన్ని ఆవిష్కరించింది. తక్కువ ప్లేసులోనే ఏర్పాటు చేసే హైజెనిక్‌‌ ఇంటిగ్రేడెడ్ మార్ట్‌‌ను తయారు చేసింది. ఇందులో స్టెయిన్‌‌లెస్‌‌ స్టీల్‌‌తో చేసిన 4విభాగాలు ఉంటాయి. ఇందులో గొర్రెలు, మేకలు ఉంచేందుకు కేజ్, కటింగ్‌‌ చేసే స్లాటర్‌‌, కటింగ్‌‌ మెషీన్‌‌, నైలాన్‌‌ ఫైబర్‌‌ బోర్డు, జనరేటర్‌‌, ఫ్రీజర్‌  సైంటిఫిక్‌‌గా ఉంటాయి. గొర్రె/మేకను కట్ చేశాక వచ్చే వేస్టేజీ బయోగ్యాస్ ప్లాంట్ కు వెళ్తుంది.

సబ్సిడీతో అందజేత..  
ఈ మార్ట్‌‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందించనున్నాయి. యువతకు పీ మార్ట్‌‌ నిర్వహణపై ఎన్ఆర్‌‌సీఎం ప్రత్యేక శిక్షణను ఇస్తుంది. స్థానిక కార్పొరేషన్లు,  మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల అనుమతితో పాటు ఫుడ్‌‌ సేఫ్టీ సంస్థ  ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ అనుమతి ఇప్పించేందుకూ కృషి చేస్తుంది.  

త్వరలో అందుబాటులోకి.. 
నాణ్యమైన మటన్‌‌ ప్రజలకు అందుబాటు లోకి తేవాలనే పోర్టబుల్‌‌ స్లాటర్‌‌, రిటైల్ యూనిట్‌‌ను రూపొందించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో దేశవ్యాప్తంగా అన్ని సిటీలు, పట్టణాలు, గ్రామాల్లో త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. 
- డాక్టర్‌‌ ఎస్బీ బర్బుదే, డైరెక్టర్‌‌, ఎన్‌‌ఆర్‌‌సీఎం

నాణ్యమైన మాంసం దొర్కుతది 
దేశంలో మొదటిసారి హైజెనిక్‌‌ ఇంటిగ్రేటెడ్‌‌ యూనిట్‌‌ను రూపొందించాం. కళ్లముందే నాణ్యమైన మాంసం కొనే వెసులుబాటు లభిస్తుంది. అంతా ఆటోమేటెడ్‌‌ టెక్నాలజీతో జరిగిపోతుంది. దీన్ని ఎక్కడికైనా తరలించుకునే వెసులుబాటు ఉంటుంది. 
- డాక్టర్‌‌ సి.రామకృష్ణ, సీనియర్‌‌ సైంటిస్ట్‌‌, ఎన్‌‌ఆర్‌‌సీఎం