అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్‌ను ‘నీకెట్ల నోబెల్ ఇచ్చారు?’ అని అడిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. బుధవారం ట్రంప్‌ను వైట్‌హౌజ్‌లో మురాద్ కలిశారు. ఇరాక్‌లోని మైనారిటీ కమ్యూనిటీ యాజిదీల దీనావస్థ గురించి వివరించారు. ఐసిస్, కుర్దిష్ వర్గాల చేతుల్లో బలవుతున్న యాజిదీలకు విముక్తి కల్పించాలని కోరారు. నదియా మాట్లాడుతుండగానే కల్పించుకున్న ట్రంప్.. ‘నీకు నోబెల్ వచ్చిందా? ఆశ్చర్యం! అసలు వాళ్లు నీకెందుకు అవార్డు ఇచ్చారు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు షాకైన నదియా.. వెంటనే తేరుకొని ‘ఐసిస్ లైంగిక బానిసలకు విముక్తి కల్పించినందుకు ఆఫ్రికా గైనకాలజిస్టు డెనిస్ ముక్వేజ్‌తో కలిపి ప్రైజ్ ఇచ్చారు’ అని వివరించారు. యాజిదీల రక్షణ కోసం ఇరాక్, కుర్దిష్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ట్రంప్ బదులిస్తూ..‘ఐసిస్‌ను లేకుండా చేశాం కదా. ఇక మీరు కుర్దిష్ వర్గాలంటున్నారు. వాళ్లెవరు?’ అన్నారు. దీంతో మురాద్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. యాజిదీ కమ్యూనిటీకి చెందిన మురాద్.. 2014లో ఐసిస్‌కు చిక్కి నరకం చూశారు. తర్వాత వాళ్ల చెర నుంచి తప్పించుకుని ఐసిస్ టెర్రరిస్టుల చెరలోని యాజిదీ యువతులకు విముక్తి కల్పించారు.
