ఉచిత కరెంట్ వద్దంటున్న కాంగ్రెస్ ను ఊరిపొలిమేరల దాకా తరిమికొట్టాలె : కేటీఆర్​

ఉచిత కరెంట్ వద్దంటున్న కాంగ్రెస్ ను ఊరిపొలిమేరల దాకా తరిమికొట్టాలె : కేటీఆర్​
  • 3 గంటల కరెంట్ కామెంట్లపై రేవంత్ క్షమాపణ చెప్పాలె
  • బీఆర్ఎస్ అంటే పంట కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు : కరెంట్​కావాలో.. కాంగ్రెస్​కావాలో రైతులే తేల్చుకోవాలని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​అన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయట పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. ‘‘వ్యవసాయానికి మూడు గంటల కరెంట్​చాలు అని అమెరికాలో రేవంత్ మాట్లాడినప్పుడు ఆయనకు తెలియక, అవగాహన లేక మాట్లాడుతున్నాడు అనుకున్నాం. కానీ శుక్రవారం రాత్రి ఒక టీవీ షోలో రేవంత్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఉన్నది చిన్న సన్నకారు రైతులే. వాళ్లకు మూడు గంటల కరెంట్​ఇస్తే సరిపోతుంది. కేసీఆర్​24 గంటల కరెంట్​ఇచ్చి వృథా చేస్తున్నారు’ అని అన్నడు. కొల్లాపూర్ లోనూ మాట్లాడుతూ.. ‘కేసీఆర్.. రైతులకు రైతుబంధు భిక్షం వేస్తున్నడు. రైతులకు మూడు గంటల కరెంట్​సరిపోతుంది’ అని మళ్లీ అన్నడు. రేపు పొరపాటున కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణలో వ్యవసాయం అంధకారం అయితది. ఉచిత కరెంట్ వద్దంటున్న కాంగ్రెస్ ను ఊరి పొలిమేరల దాకా తరిమికొట్టాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉచిత కరెంట్​పై చేసిన కామెంట్లకు గాను రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. మూడు గంటల కరెంట్​పై రాహుల్​వివరణ ఇవ్వాలన్నారు. ‘‘రాష్ట్రం వచ్చాక చెరువులు బాగు చేసుకున్నం. ఉచిత కరెంట్, రైతుబంధుతో వ్యవసాయం ఇప్పుడిప్పుడే ఒక దరికి చేరుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వస్తే.. రైతులు మళ్లీ పదేళ్ల కిందికి పోవడం ఖాయం. తాము కరెంట్ ఇచ్చిన టైమ్ లోనే రైతులు మోటార్లు పెట్టుకోవాలని కాంగ్రెసోళ్లు అర్థరహితంగా మాట్లాడుతున్నరు” అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్​ అంటే పంట కోతలు, కాంగ్రెస్ ​అంటే  కరెంట్ ​కోతలు అన్నారు.

కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ చిత్తు కాగితాలు..

కాంగ్రెస్​పానలలో రైతులకు క్రాప్ హాలీడే, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండేనని కేటీఆర్ అన్నారు. ‘‘2004లో 9 గంటల కరెంట్​ఇచ్చామని కాంగ్రెస్​ప్రభుత్వం చెప్పుకోవడమే తప్పా.. ఎక్కడా మూడు, నాలుగు గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదు. అర్ధరాత్రి కరెంట్ తో పాములు, తేళ్లు కరిచి, కరెంట్​షాక్​తో ఎంతో మంది రైతులు చనిపోయారు. మళ్లీ ఆ దుస్థితి కావాలా?” అని ప్రశ్నించారు. ‘‘కాలంతో పోటీ పడుతూ ప్రాజెక్టులు కట్టాం. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉచిత కరెంట్ కోసం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు పెడుతున్నం. వరి ఉత్పత్తిలో 15వ స్థానం నుంచి నంబర్ వన్ కు చేరుకున్నం. రాష్ట్రంలో వడ్లను కొనలేమని ఎఫ్​సీఐ చేతులెత్తేసింది. కరోనా టైమ్​లోనూ రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేశాం” అని చెప్పారు.  కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని, పాలమూరు ఎత్తిపోతలతో 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని తెలిపారు. ‘‘ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్తున్నోళ్లు.. అంతకన్నా మంచిది తెస్తామంటే ఎవరు నమ్ముతరు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఉదయించకుండానే అస్తమించింది. కాంగ్రెస్ ప్రకటిస్తున్న డిక్లరేషన్లు అన్నీ చిత్తు కాగితాలు” అని విమర్శించారు. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్​, ఆ పార్టీని
పాతరేయాలని అన్నారు.

అభివృద్ధిలో న్యూయార్క్‌‌‌‌తో హైదరాబాద్ పోటీ  

అభివృద్ధిలో అమెరికాలోని న్యూయార్క్‌‌తో హైదరాబాద్ పోటీ పడుతున్నదని, అవసరమైతే 2036లో ఒలింపిక్స్​కు ఆతిథ్యం ఇచ్చే స్థాయికి సిటీ ఎదుగుతుందని కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో నిర్వహించిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కే ఓటేయాలన్నారు. ‘‘హైదరాబాద్ ప్రజలు ఎన్నికలొస్తే ఓటింగ్‌‌కు దూరంగా ఉంటున్నారు. మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రజలంతా బయటకు వచ్చి ఓటేయాలి. ఈసారి హైదరాబాద్‌‌లో ఓటింగ్​శాతం పెంచాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.