వారంలో ఎంగేజ్‌మెంట్.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి

వారంలో ఎంగేజ్‌మెంట్.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి

పద్మారావునగర్, వెలుగు:  గాంధీ హాస్పిటల్ లో యువ డాక్టర్ గుండెపోటుతో చనిపోయాడు.  గుంటూరు జిల్లా నిజాంపట్నం కు చెందిన తూనుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా(29) పెద్దకాకానిలోని ఎన్ఆర్​ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్​ పూర్తి చేశాడు. ఈ ఏడాది జులైలో గాంధీ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీలో సీనియర్ రెసిడెన్షిప్(ఎస్ఆర్)ను  పూర్తి చేశాడు. కొంతకాలం పాటు గాంధీలో జూనియర్ డాక్టర్ గా పనిచేసిన పూర్ణచంద్ర  ప్రస్తుతం పద్మారావునగర్ లో ఉంటూ మెడిసిన్ లో పీజీ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు.

ఇటీవల అతడికి పెళ్లి సంబంధం కుదరగా.. వచ్చే వారంలో  ఎంగేజ్ మెంట్ జరగాల్సి ఉంది. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు  ఛాతిలో నొప్పి రావడంతో గ్యాస్ ప్రాబ్లమ్ గా భావించిన పూర్ణచంద్ర ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఛాతి నొప్పి తగ్గకపోవడంతో తన ఫ్రెండ్స్ తో కలిసి 6 గంటలకు గాంధీకి వెళ్లి ఇంజక్షన్ తీసుకున్నాడు.  తర్వాత గాంధీ హాస్పిటల్ పై అంతస్తులోని పీజీ మెడికల్ స్టూడెంట్ల హాస్టల్ కు మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. కొద్ది సేపటి తర్వాత అటుగా వచ్చిన అతడి ఫ్రెండ్స్​మెట్ల పై పడి ఉన్న పూర్ణచంద్రను చూసి వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అప్పటికే పూర్ణచంద్ర మైకార్డియల్ ఇన్​ఫ్రాక్షన్​ (ఎంఐ) గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వచ్చే వారంలో ఎంగేజ్ మెంట్ కు తమ ఊరికి రావాలని పూర్ణచంద్ర తమతో చెప్పాడని.. అంతలోనే ఇలా జరగడం బాధాకరమని తోటి మెడికోలు ఆవేదన వ్యక్తం చేశారు. గుప్తా ఫ్రెండ్స్ మధ్యాహ్నం డెడ్ బాడీని సొంతూరికి తీసుకెళ్లారు.  యువ డాక్టర్ పూర్ణచంద్ర మృతి విచారకరమని గాంధీ మెడికల్ కాలేజీ స్టాఫ్​, డాక్టర్లు, సిబ్బంది తెలిపారు.