- రూ.22,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 స్కూల్స్ నిర్మాణం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జగిత్యాల, వెలుగు : ప్రపంచంతో పోటీ పడేలా, ఉమ్మడి విద్యే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టూడెంట్లు ఉన్నత స్థాయికి చేరాలన్న ఉద్దేశంతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. రూ.22,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించబోతున్నట్లు చెప్పారు.
ధర్మపురిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయబోతున్నామని, రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల దృష్ట్యా బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని కుమ్మరి తండాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి బుధవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధితో పాటు వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం, పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, టీజీఎన్‌పీడీసీఎల్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ అఖిల్‌మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్ జాదవ్ పాల్గొన్నారు.
