భూమి డిమాండ్​ ఉన్న ఏరియాలకే పిల్లనిస్తున్నరు

భూమి డిమాండ్​ ఉన్న ఏరియాలకే పిల్లనిస్తున్నరు

పరిగి, వెలుగు: చదువు, జీవనాధారం  ఉన్నా  రియల్ ఎస్టేట్​ ప్రభావంతో స్థానికంగా అబ్బాయిలకు వధువులు దొరకడం లేదు.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతటా పల్లె వాతవరణం కనిపించినప్పటికీ రియల్ ఎస్టేట్ ప్రభావంతో జనాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.  ఒకప్పుడు  ప్రాంతం ఏదైనా  అనుకూల సంబంధం వస్తే అమ్మాయిని ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో నెమ్మదిగా కొన్ని ప్రాంతాల అమ్మాయిలను పల్లెలకు ఇవ్వడం మానేశారు. ఇందుకు ప్రధానంగా భూముల ధరలు పెరగడమే కారణమని చెబుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూర్ ప్రాంతాలకు అమ్మాయిలను ఇచ్చేందుకు పేరెంట్స్​ ఆలోచిస్తున్నారు. అదే చేవేళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, రాజేంద్రనగర్, షాబాద్, శంషాబాద్, షాద్ నగర్ ప్రాంతాలకు అమ్మాయిలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ ప్రాంతాలకు అమ్మాయిని ఇస్తే సిటీ కల్చర్ ఉంటుందని పేరెంట్స్​ భావిస్తున్నారు.

12 ఏండ్ల క్రితం అంతా ఒకటే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు గతంలో ప్రాంతీయ బేధాలు ఉండేవి కాదు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో అనేక పారిశ్రామిక సంస్థలు స్థాపించడంతో 2010  తర్వాత భూమి ధరలు పెరిగాయి. పారిశ్రామిక సంస్థలు రావడం హైదరాబాద్ శివారు ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలుపెరగడంతో ఆర్థికంగా బలపడ్డారు.  పాలు, కూరగాయలు, ఆకుకూరలకు డిమాండ్ పెరగడంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలుగా విడిపోయాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా వాసులకు అమ్మాయిలను ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు‌‌. కానీ వికారాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయిలను మాత్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు పెండ్లి చేసుకుంటున్నారు.  రంగారెడ్డి,  వికారాబాద్ జిల్లా బంధాలను రక్త సంబంధాలను రియల్ ఎస్టేట్ రంగం శాసిస్తోంది. అన్నా చెల్లెలు, అక్కాతమ్ముడు , బావ బామ్మర్దులు, అన్నదమ్ముల బంధాలను రియల్ ఎస్టేట్ రంగం వేరు చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల మధ్య ఉన్నోడు లేనోడు అంటూ మనసు తెంచుతూ దూరం చేస్తోంది.

ఇతర రాష్ట్రాల అమ్మాయిల కోసం ..
వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూర్ నియోజకవర్గాల్లోని వారు కర్ణాటక రాష్ట్రంలోని సేడం, గుల్బర్గా, యాద్గిర్, బీదర్, చిడుగుప్ప, మన్నెకెల్లి ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను పెండ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ అమ్మాయిలను ఇచ్చేందుకు ముందుకు రాకపోతుండటంతో ఈ ప్రాంతం కంటే వెనుకబడిన కర్నాటక లోని కొన్ని ప్రాంతాల్లోని అమ్మాయిలను చేసుకుంటున్నారు.  రోజురోజుకు వయస్సు పైబడుతుండటంతో వివాహం చేసుకునేందుకు మరింత ఆలస్యం చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని పలువురు యువకులు చెబుతున్నారు. 

లైఫ్​ స్టైల్​లో మార్పులు....
15 ఏండ్ల కిందట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసుల లైఫ్​స్టైల్​ఒకే విధంగా ఉండేది.  కానీ రియల్ వ్యాపారం కారణంగా హైదరాబాద్ కు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని వారు  ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేయడం, వ్యాపార, రాజకీయ,రియల్ ఎస్టేట్ రంగాల్లో సక్సెస్ కావడంతో పాటు ఇండ్లను కూడా నిర్మించున్నారు. ఖరీదైన దుస్తులు,కార్లు ఇక్కడి వాసులకు కామన్ గా మారింది. అదే పల్లె ప్రాంతాల్లో ప్రధాన  జీవనాధారం వ్యవసాయం మాత్రమే. ఉద్యోగ అవకశాలు పెద్దగా లేవు.  గ్రామాల్లో పురాతన ఇండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడు చాలా ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి. ఈ మార్పులు కూడా  పెండ్లిళ్లు చేసుకుపోవడానికి మరో కారణమవుతున్నాయి.

 ప్రాంతాలు అడ్డు రావొద్దు...
పెండ్లిళ్లకు ప్రాంతాలు అడ్డు రావొద్దు. అన్ని ప్రాంతాలకు అమ్మాయిలను ఇచ్చి పుచ్చుకుంటే మంచిది. ప్రస్తుతం అమ్మాయిలు దొరక్క పోవడంతో కొన్ని ప్రాంతాల వారు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.  ఒకప్పుడు అన్ని ప్రాంతాలకు అమ్మాయిలను ఇచ్చి పుచ్చుకునేవారు. కానీ ఇప్పుడే ఈ విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరెంట్స్​లో మార్పు రావాలె.
– జాకారం నారాయణ, దోమ మండలం

వరకట్నాలు మంచిది కాదు
భూముల ధరలుఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అమ్మాయిలను ఇచ్చేందుకు కూడా వరకట్నాలు అడ్డొస్తున్నాయి. వరుడు, వధువుకు నచ్చినప్పటికీ పెద్దలు అంగీకరించకపోవడంతో పెండ్లిళ్లు జరగడంలేదు. ఇది మంచిది కాదు. ఇలాంటి వ్యవస్థలో మార్పు రావాలె. 
 – బల్ల నర్సింలు, దోమ మండలం