యువతకు కాంగ్రెస్ గాలం.. నిరుద్యోగులకు భరోసా 

యువతకు కాంగ్రెస్ గాలం.. నిరుద్యోగులకు భరోసా 

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు.ప్రత్యేక రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం . కానీ దశాబ్ధ కాలంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకేజీతో మోసం చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించడం కోసమే రేపు ( మే8) కాంగ్రెస్ సభ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని భట్టి తెలిపారు.ఈ మేరకు సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు.ఆ డిక్లరేషన్ ను నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.రేపటి ( మే8)  హైదరాబాద్ సభకు నిరుద్యోగుల పెద్ద ఎత్తున తరలి రావాలని భట్టి కోరారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో పేదలకు పంచిన భూములను 10 వేల ఎకరాలను  ప్రభుత్వం లాక్కుందని  సీఎల్పీ నేత భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండగా ఉంటుందని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే  పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుందని హామీ ఇచ్చారు. 

యువతను ఆకర్షించేందుకు..


కాంగ్రెస్ పార్టీ   యువతను ఆకర్షించేందుకు పావులు కదుపుతోంది. జనాకర్షణ ఉన్న ప్రియాంక గాంధీతో సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, ప్రశ్న పత్రాలు లీకేజీ వంటి అంశాల కారణంగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతను తనవైపు తిట్టుకోవాలని భావిస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత  హస్తం గుర్తుకే ఓటు వేసేలా చూసుకునేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఎనిమిదిన నిర్వహించే నిరుద్యోగ సభలో పలు హామీలతో కూడిన ‘యూత్ డిక్లరేషన్” ను ప్రియాంక చేతుల మీదుగా విడుదల చేయాలని యోచిస్తోంది. యువశక్తి లేదా వివాహస్తం పేరుతో డిక్లరేషన్ ను ప్రకటించే అవకాశాలు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రియాంక గాంధీ ఆవిష్కరించే డిక్లరేషన్ లో 9 అంశాలకు చోటు కల్పించినట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఏటా జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలకు డిక్లరేషన్ లో చోటు కల్పించినట్టు తెలుస్తోంది.