తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమవరపుకుంట తండాకు చెందిన బానోత్ ప్రవీణ్(25) పాముకాటుతో చనిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. భోజనం చేసి ఇంటి ముందు రేకుల షెడ్ లో నిద్రిస్తుండగా, బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కట్ల పాము మెడ భాగంలో కాటు వేసింది. వెంటనే లేచిన ప్రవీణ్ పామును చంపేశాడు. అనంతరం హాస్పిటల్కు వెళ్దామని కుటుంబ సభ్యులు చెబుతున్నా వినకుండా పడుకున్నాడు.
రాత్రి ఒంటి గంట ప్రాంతంలో వాంతులు, విరోచనాలు కావడంతో చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి తల్లి రంగమ్మ, భార్య మమత, ఐదుగురు అక్కలు ఉండగా, తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు.
