
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఔట్ సోర్సింగ్ విధానంలో 200 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచి రెండ్రోజుల పాటు అప్లికేషన్లు స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే 2022–-23 ఏడాదికి పోలీస్కానిస్టేబుల్ ఉద్యోగాల్లో స్వల్ప మార్కులతో దూరమైన అభ్యర్థులు మాత్రమే.. దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడించింది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ తుది ఫలితాల నివేదిక ఆధారంగా అందులో పేర్లున్న వారి అప్లికేషన్లను మాత్రమే హైడ్రా సిబ్బంది సోమవారం స్వీకరించారు.
అప్లై చేసుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగా యువత తరలి వచ్చారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భారీగా క్యూ లైన్ ఏర్పడింది. మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొలిరోజు దాదాపు 500 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనున్నారు.