పంచాయతీ బరిలో యువతరం.. నామినేషన్లు వేసినోళ్లలో 73 శాతం 30 నుంచి 44 ఏండ్లలోపువాళ్లే !

పంచాయతీ బరిలో  యువతరం.. నామినేషన్లు వేసినోళ్లలో 73 శాతం  30 నుంచి 44 ఏండ్లలోపువాళ్లే !
  • సర్పంచ్ బరిలో 62%, వార్డు సభ్యుల్లో 78% యువతే 
  • మొదటి, రెండో విడత నామినేషన్లలో ఇదే ట్రెండ్ 

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు పల్లె రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో సింహభాగం యువతదే కావడం విశేషం. స్టేట్ ఎలక్షన్ కమిషన్​కు వచ్చిన తాజా గణాంకాల ప్రకారం.. రెండు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్లు వేసిన వారిలో 30 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారే దాదాపు 73 శాతం ఉన్నట్లు వెల్లడైంది. 

ఇది ఎన్నికల ఉత్సాహం మాత్రమే కాదు, గ్రామాల్లో నాయకత్వ మార్పునకు, అభివృద్ధిలో భాగస్వామ్యానికి యువత ఇస్తున్న బలమైన సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల సరళిని పరిశీలిస్తే సర్పంచ్ రేసులో నిలిచిన వారిలో 62 శాతం మంది యువతే ఉండగా, వార్డు సభ్యుల స్థానాలకు ఏకంగా 78 శాతం మంది యువతీయువకులు పోటీ పడుతున్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావంతులు, ఉన్నత చదువులు చదివిన వారు కూడా పంచాయతీ ఎన్నికల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే కాకుండా, సామాన్య కుటుంబాలకు చెందిన యువత కూడా నామినేషన్లు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి, రెండో విడత నామినేషన్ల డేటా ఈ కొత్త ట్రెండ్​కు అద్దం పడుతోంది. 

కాగా, ఫస్ట్​ ఫేజ్ లో 189 మండలాల్లో 4,236 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్లలో 85 వేల మంది అభ్యర్థులు 30 నుంచి 44 ఏండ్లలోపు వాళ్లే ఉన్నారు. అంటే మొత్తం నామినేషన్లలో 79 శాతం ఉన్నారు. అలాగే సెకండ్ ఫేజ్​లో 193 మండలాల్లోని 4,333 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్లలోనూ అత్యధికంగా 40 ఏండ్లలోపువాళ్లే ఉన్నారు. ఇందులోనూ సర్పంచ్, వార్డు సభ్యులకు లక్ష వరకు నామినేషన్లు రాగా, 76 శాతం యువతవే ఉన్నాయి.  

పెరిగిన రాజకీయ చైతన్యం 

గ్రామాల్లో పెరిగిన రాజకీయ చైతన్యం, సోషల్ మీడియా యువతను ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఉద్యోగాలు వదిలేసి, ఎంబీఏ, బీటెక్ పూర్తి చేసిన వారు కూడా సర్పంచ్ బరిలో నిలిచారు. గతంలో వార్డు సభ్యుల ఎన్నికలను పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతి వార్డులోనూ యువత పోటీకి దిగుతుండటంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివినవారు, ఐటీ ఉద్యోగులు సైతం సెలవులపై వచ్చి మరీ నామినేషన్లు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఎంబీఏ చదివిన యువకుడు, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ గా నామినేషన్ వేశాడు. 

"పల్లెలో ఉంటూనే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా ప్రపంచంతో పోటీ పడవచ్చు, మన ఊరిని స్మార్ట్ విలేజ్‌‌‌‌‌‌‌‌గా మార్చవచ్చు" అని ఆ యువకుడు చెబుతున్న మాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. అలాగే, వరంగల్ జిల్లాలో బీటెక్ విద్యార్థిని ఒకరు వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. ఇలా రెండు విడతల్లో దాదాపు 9 వేల గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద ఎత్తున యువత నామినేషన్లు వేశారు. గత రెండు, మూడు దశాబ్దాల పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో యువత నామినేషన్లు దాఖలు చేయడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెప్తున్నారు.  

ఏకగ్రీవాలకు చెక్ పెట్టేలా పోటీ  

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్ గిరీ కోసం ఏకంగా 22,330 మంది బరిలో నిలిచారు. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే 37,440 స్థానాలకు గాను ఏకంగా 85,428 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సగటున ఒక్కో సర్పంచ్ పదవికి ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రధాన గ్రామాల్లో ఈ సంఖ్య పదికి పైగానే ఉండటం విశేషం. 

వార్డు సభ్యుల స్థానాలకు కూడా గతంలో ఏకగ్రీవాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి ఆ పదవులకు కూడా యువత పోటీకి సై అంటుండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంగళవారంతో ముగిసిన రెండో విడత నామినేషన్ల ప్రక్రియలోనూ అదే జోరు కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన 4,332 గ్రామ పంచాయతీలకు గాను, కేవలం రెండు రోజుల్లోనే 12,479 మంది సర్పంచ్ పదవుల కోసం నామినేషన్లు వేశారు. ఇక వార్డు సభ్యుల స్థానాలకు 30,040 నామినేషన్లు వచ్చాయి. రెండో విడతలో మొత్తం సర్పంచ్ నామినేషన్లు 20 వేల మార్కును దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి మొదలు కానుంది.  

యూత్​ను ఎంకరేజ్ చేయాలి 

నేను వ్యవసాయం చేస్తాను. ట్రావెల్స్ కూడా నడిపిస్తా. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. నాతో పాటు ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు కాస్త పెద్దవాళ్లు. వార్డు సభ్యులుగా మా ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న వాళ్లంతా 30 ఏండ్లలోపే ఉన్నారు. గ్రామాభివృద్ధి కోసం యూత్​ను పాలిటిక్స్ లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది.  
- జి. వాసు, ధర్మారం(బి) గ్రామం , 
డిచ్​పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా

అవకాశం వచ్చింది.. పోటీ చేస్తున్నా 

నేను ప్రైవేట్ బిజినెస్ చేస్తున్నాను. మా గ్రామంలో గత కొన్నేండ్లుగా 50 ఏండ్లు, ఆ పై వాళ్లే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేశారు. కానీ ఈసారి నాకు అవకాశం వచ్చింది. నా ఆసక్తిని గమనించి అధికార పార్టీ నాకు మద్ధతు తెలిపి, పోటీ చేయాలని ప్రోత్సహించింది. గ్రామం అభివృద్ధి కావాలంటే యువత యాక్టివ్​గా పాలిటిక్స్ చేయాలి. వార్డు సభ్యులుగా కూడా పూర్తిగా 40 ఏండ్లలోపు ఉన్నవాళ్లే నామినేషన్లు వేశారు. 
– సుధీర్, పున్నెల్ గ్రామం, హన్మకొండ జిల్లా