- ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అందరూ కలిసిరావాలని పిలుపు
ముషీరాబాద్, వెలుగు: ప్రపంచమంతా యువతపై విశ్వాసం పెట్టుకున్నదని, నూతన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నది యువతరమేనని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉండేదని, ఐక్యత లోపం వల్ల బ్రిటిష్ పాలనకు లోనైందని పేర్కొన్నారు. భారత్ మళ్లీ విశ్వగురువుగా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’ దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు.
దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, నడుం బిగించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఫిజియోథెరపీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశం అనేక సంస్కృతులకు నిలయమని, ఐక్యతతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో భాషలు నేర్చుకోవచ్చని, తల్లి లాంటి మాతృభాషకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం వ్యాయామం, యోగ తప్పనిసరి చేయాలని, జంక్ ఫుడ్‌ను తగ్గించాలని సూచించారు. బియ్యం, రాగులు, సజ్జలు, పెరుగు వంటి సంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి అధ్యక్షురాలు ఉషా కంద, లక్ష్మీ సుందరి, వైఎస్ఎన్ మూర్తి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
