30 ఏండ్లలోపే రోగాల బారిన యూత్!..ఆరోగ్యంగా ఉన్నది 25 శాతం మందే

30 ఏండ్లలోపే రోగాల బారిన యూత్!..ఆరోగ్యంగా ఉన్నది 25 శాతం మందే
  • ఆరోగ్యంగా ఉన్నది 25 శాతం మందే
  • 59 శాతం మందికి ఊబకాయం
  •     20 ఏండ్లు నిండకుండానే అమ్మాయిలకు సమస్యలు
  •     40 శాతం మందికి రక్తహీనత ​ 
  •     విటమిన్​ బీ12, విటమిన్ డీ లోపాలు
  •     మహిళల్లో 51 ఏండ్లకే క్యాన్సర్​ ముప్పు
  •     అన్ని ఏజ్​ గ్రూప్​లలో సగం మందికి గుండె జబ్బులు
  • అపోలో హాస్పిటల్స్​ ‘హెల్త్​ ఆఫ్​ ద నేషన్​ రిపోర్టు’లో ఆందోళనకర అంశాలు

హైదరాబాద్, వెలుగు: ‘ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు..’యూత్​ గురించి స్వామి వివేకానందుని అభిప్రాయమిది. అప్పట్లో యవ్వనమంటేనే ఉరకలెత్తే ఉత్సాహం.. కానీ నేటితరం యువత పుట్టుకతో వృద్ధులు అన్నట్లుగా తయారవుతున్నారు. సరైన తిండి లేక, ఎండలో తిరక్క, వ్యాయామం చేయక, పనీపాటా లేక ఊరికే నీరసించిపోతున్నారు. పట్టుమని పాతికేండ్లకే పుట్టెడు రోగాల బారిన పడ్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేదు. 100 మందిలో కేవలం 25 శాతం మందే ఆరోగ్యంగా ఉంటున్నారు. మిగిలిన 75 శాతం మంది రోగాల కుప్పలే! మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో మూడోవంతు రక్తహీనతతో బాధపడ్తున్నారు. విటమిన్​ బీ12, విటమిన్​ డీ లోపాలతో సతమతమవుతున్నారు. 20 ఏండ్ల వయసులోనే బీ12 లోపం తీవ్రమై, నరాల బలహీనత, సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని, ఇలాంటివారు 40 ఏళ్లకి ఊబకాయం, మెనోపాజ్​ దశలో షుగర్, బీపీ లాంటి సమస్యల బారినపడ్తున్నారు. 

అపోలో హాస్పిటల్స్​ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ‘హెల్త్​ ఆఫ్​ ద నేషన్​’అనే రిపోర్టులో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నిరుడు దేశవ్యాప్తంగా 37.5 లక్షల మందికి అపోలోహాస్పిటల్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్​ టెస్టుల రిపోర్టుల ఆధారంగా అపోలో హాస్పిటల్స్​ ఈ నిర్ధారణకు వచ్చింది. అదే సమయంలో మహిళలకు క్యాన్సర్​ ముప్పు కూడా త్వరగా వచ్చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 51 ఏండ్లకే బ్రెస్ట్​ క్యాన్సర్​ బారిన పడుతున్నారని, మిగతా దేశాలతో పోలిస్తే పదేండ్ల ముందే మన దగ్గర మహిళలు బ్రెస్ట్​ క్యాన్సర్​తో సతమతమవుతున్నట్టు ఈ రిపోర్ట్​ తేల్చింది. ప్రతి 350 మందిలో ఒకరికి బ్రెస్ట్​ క్యాన్సర్​ ఉన్నట్టు వెల్లడించింది. అందులో 60 శాతం మంది అడ్వాన్స్డ్​ స్టేజ్​లో ఉన్నట్టు తెలిపింది. ప్రతి 422 మందిలో ఒకరికి 45 ఏండ్ల వయసులోనే సర్వైకల్​ క్యాన్సర్​ ఉన్నదని, 70 శాతం మంది అడ్వాన్స్డ్​ స్టేజ్​లో ఉన్నారని హెచ్చరించింది. క్యాన్సర్​ స్క్రీనింగ్​పై మహిళలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని, కేవలం ఒకటి నుంచి 2 శాతం మంది మాత్రమే క్యాన్సర్​ టెస్టులు చేయించుకుంటున్నారని పేర్కొంది. 

ఒళ్లు వంచట్లే.. 

యువత కనీసం ఒళ్లు కూడా వంచలేని స్థితిలో ఉన్నారని అపోలో రిపోర్ట్​ తేల్చి చెప్పింది. యువతతో పోలిస్తే 50 ఏండ్లపైనున్న వాళ్లే ఫ్లెక్సిబుల్​గా, స్ట్రాంగ్​గా, సమతులంగా ఉన్నారంటూ స్పష్టం చేసింది. 65 శాతం మంది యువత కనీసం ఒళ్లు వంచలేనంత స్థితిలో ఉన్నారని హెచ్చరించింది. ఇటు 50 ఏండ్లుపైబడిన వారిలో 80 శాతం మందికి ఆ సమస్య ఉన్నా.. యువతలో సగానికిపైగా ఈ సమస్య ఉండడం తీవ్రతకు అద్దంపడుతున్నది. ఈ క్రమంలోనే 30 ఏండ్లలోపున్న వారిలో 34 శాతం మందికి ఒక ఆరోగ్య సమస్య, 26 శాతం మందికి కనీసం రెండు సమస్యలు, 16 శాతం మందికి మూడుకుపైగా అనారోగ్య సమస్యలున్నట్టు రిపోర్ట్​ స్పష్టం చేసింది. 

ఇక, మిగతా ఏజ్​గ్రూప్​లలోనూ ఆరోగ్య సమస్యలు అధికంగానే ఉన్నట్టు తేల్చింది. 30 నుంచి 39 ఏండ్ల మధ్య ఉన్న వారిలో 89 శాతం మందికి అనారోగ్య సమస్యలున్నాయి. 40 నుంచి 49 ఏండ్ల మధ్య 93 శాతం మంది, 50 నుంచి 59 ఏండ్ల మధ్య ఉన్న వారిలో 94 శాతం మందికి సమస్యలున్నట్టు వెల్లడించింది. 69 శాతం మంది యువతలో విటమిన్​ డీ లోపం ఉంది. 59 శాతం మంది యువత ఊబకాయులే కావడం ఆందోళన కలిగించే అంశం. 52 శాతం మందిలో కొలెస్ట్రాల్​ అధికంగా ఉంటున్నది. 46 శాతం మంది బీపీ బారిన పడ్డారు. లక్ష మంది యువత శాంపిళ్లను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైంది. మరోవైపు 13 కాలేజీల్లోని 20 వేల మంది స్టూడెంట్లను స్క్రీనింగ్​ చేస్తే.. 66 శాతం మందికి ఏదో ఒక సమస్య ఉందని, వారు అర్జెంట్​గా హాస్పిటల్​కు వెళ్లాల్సిందేనని రిపోర్ట్​ తేల్చడం ఆందోళన కలిగించే అంశం. కాలేజీ స్టూడెంట్లలో 40 శాతం మంది బరువు ఎక్కువున్నారు. 

సగం మందికి గుండె జబ్బులు..

అన్ని ఏజ్​ గ్రూప్​లలో గుండెజబ్బుల ముప్పు తీవ్రంగా ఉందని రిపోర్ట్​ హెచ్చరించింది. సగం మందికి ఆ ముప్పు ఉందని, అది బయటపడడం లేదని ‘రిపోర్ట్​’ ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్యాటీ లివర్​ సమస్యలు వెంటాడుతున్నాయని, 74 శాతం మందిలో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లు తేల్చింది. కానీ బ్లడ్​ టెస్టులతో ఆ సమస్య బయటపడడం లేదని పేర్కొంది. లివర్​కు సంబంధించి అన్ని ఎంజైములు నార్మల్​గానే ఉంటున్నాయని, అల్ట్రాసౌండ్​లో మాత్రం ఫ్యాటీ లివర్ ​సమస్య ఉన్నట్టు బయటపడ్తోందని రిపోర్టు పేర్కొంది. ఫ్యాటీ లివర్​ ఉన్నోళ్లలో 27 శాతం మందికి డయాబెటిస్​, 66 శాతం మందికి అసాధారణ స్థాయిల్లో కొలెస్ట్రాల్​ ఉన్నట్టు స్పష్టం చేసింది.