ఇండియన్ యూట్యూబర్స్ సంపాదన.. మూడేళ్లలో రూ.21 వేల కోట్లు.. ఈ లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే..!

ఇండియన్ యూట్యూబర్స్ సంపాదన.. మూడేళ్లలో రూ.21 వేల కోట్లు.. ఈ లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే..!

యూట్యూబ్.. అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న చిన్న పిల్లల నుంచీ.. జీవిత చరమాంకంలో ఉన్న పండు ముసలి వరకు అందరికీ అవసరమైన అత్యవసర మాద్యమం. యూట్యూబ్ లేకుండా చిన్న పిల్లలు భోజనం చేసే పరిస్థితి లేదు.. ఇంట్లో వంటలు చేయడానికి.... స్టూడెంట్స్ చదువుకోవడానికి.. ఎంప్లాయ్స్ ఆఫీస్ వర్క్ చేయడానికి.. చివరికి డాక్టర్లు సర్జరీ చేయడానికి కూడా యూట్యూబే కావాల్సిన గత్యంతరం ఏర్పడిన పరిస్థితి. 

కరోనా నుంచి వచ్చిన ఈ ట్రెండ్ తో ఎంతో మంది దీన్ని ఉపాధి మార్గంగా మలచుకున్నారు. వివిధ టాపిక్స్ పై ఛానెల్స్ పెట్టి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయారు. ఏం చేస్తున్నావు.. అంటే యూట్యూబ్ బిజినెస్ అన్నంతలా మారిపోయింది. వీడియో ట్రెండ్ అవ్వడం.. వ్యూస్ రావడాన్ని బట్టి ఆదాయం సమకూరుతోంది. 

ఈ రకంగా వంటల ఛానెల్స్ నుంచి సివిల్స్ ప్రిపేరేషన్ వరకు.. కామెడీ నుంచి హర్రర్ వరకు.. కాదేదీ యూట్యూబ్ వీడియోకు అనర్హం అన్నట్లుగా కంటెంట్ క్రియేట్ చేస్తూ సంపాదిస్తున్నారు యూట్యూబర్లు. అయితే గత మూడేళ్లలో ఇండియన్ యూట్యూబర్లు ఈ ప్లాట్ ఫామ్ నుంచి 21 వేల కోట్లు సంపాదించారట. వివిధ కంటెంట్ క్రియేటర్లకు మేడేళ్లలో యూట్యూబ్ ఇచ్చిన రెవెన్యూ 21 వేల కోట్ల రూపాయలని యూట్యూబ్ సీఈఓ నియాల్ మోహన్ తెలిపారు. ముంబైలో జరుగుతున్న వరల్డ్  ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) లో పాల్గొన్న ఆయన గత మూడేళ్ల లెక్కలు చెప్పారు. 

గత సంవత్సరంలో ఇండియాలో మొత్తం పది కోట్ల యూట్యూబ్ ఛానెల్స్ కంటెంట్ అప్లోడ్ చేసినట్లు సీఈవో వెల్లడించారు. అందులో 15 వేల మంది లక్ష సబ్ స్క్రైబర్లను పొంది మంచి ఆదాయం సంపాదించారని చెప్పారు. ఇండియాలో కంటెంట్ ప్రొడక్షన్ ఒక విలువైన వ్యాపారంగా మారిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఇండియన్ కంటెంట్కు విదేశాల్లో ఫుల్ డిమాండ్:

ఇండియన్ కంటెంట్ క్రియేటర్స్ అప్ లోడ్ చేస్తున్న వీడియోలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉందని సీఈఓ నియాల్ మోహన్ తెలిపారు. గత ఏడాది ఇండియన్స్ క్రియేట్ చేసిన వీడియోలకు 45 బిలియన్ల వాచ్ టైమ్ వచ్చినట్లు చెప్పారు.‘‘ ఇండియా ఫిలిం - మ్యూజిక్ లో మాత్రమే గ్లోబల్ లీడర్ కాదు.. రానున్న రోజుల్లో క్రియేటర్ నేషన్ గా మారుతుంద’’ని ఈ సంద్భంగా అన్నారు. భవిష్యత్తులో  టూల్స్, ట్రైనింగ్ తో పాటు ఇతర అంశాలలో యూట్యూబ్ ను డెవలప్ చేసేందుకు 850 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.