సరిగ్గా మాటలు కూడా రావు.. రెండేళ్లకే సెలబ్రిటీ అయిపోయింది.. ఈ పాప స్టోరీ తెలుసుకోవాల్సిందే

సరిగ్గా మాటలు కూడా రావు.. రెండేళ్లకే సెలబ్రిటీ అయిపోయింది.. ఈ పాప స్టోరీ తెలుసుకోవాల్సిందే

ఊహ తెలియకముందే కొన్ని లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. బుడి బుడి అడుగులు వేస్తున్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్​ అయ్యింది​ అనయ కంధాల్. ఆమె చిరునవ్వుకు యూట్యూబ్​లో కోట్లమంది ఫ్యాన్స్​ ఉన్నారు. అనయ అల్లరి చేసే వీడియోలకు లెక్కలేనన్ని వ్యూస్​ వస్తుంటాయి. సరిగ్గా మాటలు రాని వయసులోనే సోషల్​ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. 

అనయ కంధాల్ 2021 జూన్ 21న ఉత్తరప్రదేశ్​లోని లక్నోలో పుట్టింది.  నాలుగు సంవత్సరాల వయసులోనే యూట్యూబ్ స్టార్‌‌గా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అనయ యూట్యూబ్​ ప్రయాణం ఆమెకు రెండేళ్లు ఉన్నప్పుడే మొదలైంది. ఆమె తల్లిదండ్రులు ప్రీతిరానా, జోనీ. అనయ చిన్నప్పటినుంచే బాగా యాక్టివ్​గా ఉండేది. అల్లరి చేసేది. అందుకే వాళ్లు ఎప్పుడూ తమ గారాల పట్టి వీడియోలు తీస్తుండేవాళ్లు. ఆ ఆనందకరమైన క్షణాలను ప్రపంచంతో పంచుకోవాలని ఆ వీడియోలను యూట్యూబ్ చానెల్​లో అప్​లోడ్ చేశారు. ఆ వీడియోలు అందరికీ నచ్చాయి. దాంతో లక్షల్లో వ్యూస్​ వచ్చాయి. అంతే అప్పటినుంచి రెగ్యులర్​గా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. 

వాస్తవానికి అనయ తల్లిదండ్రులు ఆమెని యూట్యూబర్​ని చేయాలి అనుకోలేదు. కానీ.. అప్పుడప్పుడు చూసుకోవడానికి వాళ్ల ఫ్యామిలీ మెమొరీస్​ని డాక్యుమెంట్​ చేసుకోవాలి అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే చానెల్​ పెట్టారు. ఈ విషయం వాళ్ల చానెల్​ ‘‘అనయ కంధాల్” డిస్క్రిప్షన్​ చూస్తే అర్థమైపోతుంది. అయితే.. వాళ్లు అలా అనుకోకుండా చేసిన ప్రయత్నమే అనయని యూట్యూబ్​ స్టార్​ని చేసింది. పైగా అప్పట్లో వాళ్ల చానెల్​లో కంటెంట్‌‌ కోసం పెద్దగా ప్లానింగ్ కూడా చేసేవాళ్లు కాదు. ఇప్పుడు మాత్రం కంటెంట్‌‌ క్రియేషన్​లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని వయసుల వాళ్లకు నచ్చే విధంగా ప్లాన్​ చేస్తున్నారు. 

అప్పుడప్పుడు అనయ అమ్మమ్మ కూడా వీడియోల్లో కనిపిస్తుంటుంది. రెగ్యులర్​గా డైలీ వ్లాగ్స్​తోపాటు అనయ చేసే చిన్న చిన్న సాహసాలు, పుట్టినరోజు వేడుకలు, ఎవరికీ ఇబ్బంది కలిగించని ప్రాంక్స్​, కుటుంబంతో గడిపిన మధురమైన క్షణాలను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేస్తుంటారు. అనయ ‘‘మాయా స్టార్’’ను కనుగొనడం, వాళ్ల అమ్మతో కలిసి ఇంట్లో దెయ్యం ఉందని నాన్నని ప్రాంక్ చేయడం లాంటి వీడియోలు ఆమెని పిల్లలు, కుటుంబాలకు దగ్గరచేశాయి. మరో ప్రత్యేకత ఏంటంటే.. వీడియో క్వాలిటీ, ఎడిటింగ్​ చాలా బాగుంటాయి. వాటి వల్ల కూడా వ్యూస్​ పెరుగుతున్నాయి. 

ఇలా మొదలైంది

అనయ యూట్యూబ్ ప్రయాణం రెండేండ్ల క్రితం మొదలైంది. ‘‘మై ఫస్ట్ వ్లాగ్”పేరుతో  మొదటి వీడియో అప్​లోడ్​ చేశారు. అందులో వాళ్ల అమ్మ కొన్ని మాటలు చెప్తే అనయ వాటిని రిపీట్​ చేసింది. ఆ వీడియోకు పెద్దగా వ్యూస్​ రాలేదు. దాంతో కొన్ని నెలలపాటు మళ్లీ పెద్ద వీడియోలు చేయలేదు. కేవలం షార్ట్‌‌‌‌ వీడియోలు మాత్రమే అప్​లోడ్​ చేశారు. అనుకోకుండా ఆ వీడియోలు వైరల్​ అయ్యాయి. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

చేసిన ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్​ వచ్చేవి. 2024 ఏప్రిల్​లో అనయ చానల్  వారం రోజుల్లో ఎక్కువ వ్యూస్​ వచ్చిన టాప్​ 50  చానెళ్ల లిస్ట్‌‌లో చేరింది.  732.1 మిలియన్ వీక్లీ వ్యూస్​తో ఈ రికార్డ్‌‌‌‌ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు చానెల్‌‌‌‌కు 50 బిలియన్లకు పైగా వ్యూస్​ వచ్చాయి. అనయకు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు.

సబ్‌‌స్క్రయిబర్స్​..

‘అనయ కంధాల్’​ చానెల్​ని 2016లోనే మొదలుపెట్టారు. కానీ.. వీడియోలు అప్​లోడ్​ చేయలేదు. అనయ పుట్టిన తర్వాత 2022లో మొదటి వీడియో అప్​లోడ్​ చేశారు. ప్రస్తుతం 59.6 మిలియన్ల మంది చానెల్‌‌ను సబ్‌‌స్క్రయిబ్​ చేసుకున్నారు. అంటే కంటెంట్​ చేయడం మొదలుపెట్టిన రెండున్నరేళ్లలోనే కోట్ల మంది ఫాలోవర్స్​ వచ్చారు. చానెల్​లో ఇప్పటివరకు 1 బిలియన్​ వ్యూస్​ దాటిన షార్ట్ వీడియోలు మూడు ఉన్నాయి. ఇక వంద మిలియన్ల వ్యూస్​ వచ్చిన వీడియోలకైతే లెక్కేలేదు. అలాంటివి బోలెడు ఉన్నాయి.  అంతేకాదు.. యూట్యూబ్ యాడ్ రెవెన్యూ, బ్రాండ్ ప్రమోషన్స్​ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తోంది ఈ చిచ్చరపిడుగు.