నా బిడ్డ యూట్యూబ్ వీడియోల కోసమే పాక్ వెళ్లింది.. ఫ్రెండ్స్‎కు ఫోన్ చేయొద్దా..? జ్యోతి మల్హోత్రా తండ్రి

 నా బిడ్డ యూట్యూబ్ వీడియోల కోసమే పాక్ వెళ్లింది.. ఫ్రెండ్స్‎కు ఫోన్ చేయొద్దా..? జ్యోతి మల్హోత్రా తండ్రి

చంఢీఘర్: పాకిస్థాన్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ) ఏజెంట్‎గా పని చేస్తోందన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు శనివారం (మే 17) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జ్యోతి అరెస్ట్‎పై ఆమె తండ్రి హరిస్ మల్హోత్రా స్పందించారు. ఆదివారం (మే 18) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె జ్యోతి కేవలం యూట్యూబ్ వీడియోల చిత్రీకరణ కోసమే పాకిస్థాన్‎కు వెళ్లిందని అన్నారు. 

పాకిస్థానే కాకుండా వీడియో షూట్‎ల కోసం ఇతర ప్రదేశాలకు కూడా వెళ్లేదని..  అప్పుడు అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్‎కు ఆమె కాల్ చేయొద్దా..? అని ప్రశ్నించారు. పోలీసులు తమ కుటుంబ సభ్యుల ఫోన్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారని.. తిరిగి తమ ఫోన్లు ఇవ్వాలని ఆయన కోరారు. మా అందరిపై కేసు నమోదు చేశారని తెలిపారు. పాకిస్తాన్‌కు వెళ్లే ముందు తన కుమార్తె అవసరమైన అన్ని అనుమతి తీసుకుందని ఆయన వెల్లడించారు.

ALSO READ | Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్..అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

పాక్ ఐఎస్ఐ ఏజెంట్‎గా పని చేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురుని శనివారం (మే 17) హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.  వీరంతా పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. భారత్‎కు చెందిన సున్నితమైన సమాచారంతో పాటు, సైనిక రహస్య సమాచారాన్ని పాక్‎కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. హర్యానా, పంజాబ్‎లో విస్తరించి ఉన్న ఈ ఇన్ఫార్మర్ నెట్‎వర్క్ డబ్బులకు ఆశపడి పాక్‎కు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు కనుగొన్నారు.

కీలక నిందితురాలైన జ్యోతి మల్హోత్రా "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ట్రావెలింగ్‎కు సంబంధించిన వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే 2023లో పాక్ ఐఎస్ఐ అజెంట్ల ద్వారా ట్రావెల్ వీసా మీద జ్యోతి పాకిస్థాన్‎లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తోన్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో ఆమెకు పరిచయమైంది.

జ్యోతిని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (PIO)లకు డానిష్ పరిచయం చేశాడు. ఇందులో ఓ పీఐవోతో ఆమె సన్నిహిత సంబంధం పెట్టుకుని బాలి వంటి విదేశీ పర్యటనలకు కూడా వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో జ్యోతి టచ్‎లో ఉన్న జ్యోతి.. భారత్‎లోని పలు ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి చేరవేసినట్లు గుర్తించారు.

 ఈ మేరకు జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాల కింద కేసు నమోదు చేశారు. జ్యోతితో పాటు మిగిలిన నిందితులు నేరం అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను ఆదివారం (మే 18) మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా.. 5 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.