బుధవారం ( నవంబర్ 26 ) పులివెందులలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. బ్రాహ్మణపల్లెలో అరటి రైతులను పరామర్శించారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. కూటమి ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని.. 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదని అన్నారు జగన్. చంద్రబాబుకు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందని.. కూటమి ప్రభుత్వం త్వరలోనే బంగాళాఖాతంలో కలవడం ఖాయమని అన్నారు జగన్.
చంద్రబాబు వ్యవసాయం దండగ అని నమ్ముతున్నారని.. అన్నదాత సుఖీభవ కింద రూ. 40 వేలు ఇస్తామని, రూ. 10 వేలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఆఖరికి ఎరువులు కూడా బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. తన హయాంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ నడపటానికి కరెంటు బిల్లులు భారం అవుతాయని.. నిలిపివేశారని మండిపడ్డారు జగన్.
ఈ 17 నెలల కాలంలో 16 విపత్తులొచ్చాయని.. కానీ, రైతులకు కనీస సాయం కూడా అందలేదని అన్నారు జగన్. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. రైతులకు సమస్య వచ్చిన ప్రతిసారీ ఒక వర్గం మీడియా మద్దతుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు జగన్.
