
హైదరాబాద్ : దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్ క్రైమ్ జరగలేదేమో అని తెలిపారు వైసీపీ అధినేత జగన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై జగన్ బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్ క్రైమ్ కాదా?. గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరంగా ఇచ్చాం.
దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్ జరగలేదు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి. 59 లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్‌కు అందించాం. వెరిపై చేసి దానిలో తప్పుంటే తీసేయండి అని కోరాం. ఫారం 7 అనేది రిక్వెస్ట్ ఫర్ ఎంక్వయిరీ. అలా చేయడం తప్పు కాదు, నేరం కాదు.’ అని తెలిపారు జగన్.