ప్రతీ డిపార్ట్‌మెంట్‌లోనూ చంద్ర‌బాబు మ‌నుషులే: జగన్

ప్రతీ డిపార్ట్‌మెంట్‌లోనూ చంద్ర‌బాబు మ‌నుషులే: జగన్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నేడు గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో జగన్.. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల చోటు చేసుకున్న ఘటనలు, పార్టీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి తదితర అంశాలను గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ డిపార్ట్ మెంట్ మరియు అధికార యంత్రాంగాలన్నింటిలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఒకే కులానికి చెందిన 40మంది డీఎస్పీలకు అధికార పార్టీయే పదోన్నతులిచ్చిందన్నారు. పోలీస్ అధికారులకు ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇచ్చి, నిందితులపై కేసులు పెట్టకుండా బాధ్యులపై కేసులు పెడుతున్నారని జగన్ విమర్శించారు. డీఎస్పీలు టీడీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు

ఈవీఎంల భద్రత గురించి మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్ లన్నింటినీ కేంద్రబలగాలు తమ పరిధిలోకి తీసుకోవాలని గవర్నర్ కు తెలిపామన్నారు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ లు తెరిచి ఈవీఎంలను బయటకు తీశారని ఆరోపించారు. ఓటు వేసిన అంశంపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఓట్లు ఎవరికి పడిందో కనిపించలేదని చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సీఎం స్థాయి వ్యక్తికి సరియైనదేనా అని ప్రశ్నించారు.

ఇనమెట్ల గ్రామంలో.. కోడెల శివప్రసాదరావు తన చొక్కాను తానే చించుకున్నారన్నారు. పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి కోడెల తలుపులు మూసుకున్నారన్నారు. ఆ స‌మ‌యంలో పోలింగ్ బూత్ లో ఆఫీస‌ర్స్ , ఏజెంట్స్ ఎవ‌రూ లేరా అని ప్ర‌శ్నించారు. అధికారులు చూసి కూడా కోడెల మీద కేసు ఎందుకు పెట్టలేదని ప్ర‌శ్నించారు. అలాగే ఎమ్మెల్యే శ్రీవాణిపై టీడీపీ నేతలు దాడి చేశారని, ఏపీలో శాంతి భద్రతలు ఉన్నాయా? అని జగన్ ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు సెక్రటేరియేట్ లో చేసిన అవినీతి ఆధారాలను మటుమాయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని జగన్ విమర్శించారు. తనకు సంబంధించిన బినామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు పంపీణీ చేశారన్నారు.

ఈవీఎంలపై ఫిర్యాదులు చేస్తున్నది కేవలం చంద్రబాబు మాత్రమే తప్ప, ప్రజలు కాదని జగన్ అన్నారు. 80 శాతం మంది ఓటు వేసి, తాము ఎవరికి ఓటు వేశామో వీవీ ప్యాట్ లో చూసుకుని సంతృప్తి చెందారని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని, చంద్రబాబు మాత్రం తాను ఎవరికి ఓటు వేసిందీ తనకు తెలియడం లేదని డ్రామాలు ఆడుతున్నారని, ఓ విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ ఏజంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు కూడా ఏ విధమైన ఫిర్యాదులూ లేవని అన్నారు. ఈవీఎంలలో లోపాలుంటే, దాదాపు 40 వేలకు పైగా ఉన్న పోలింగ్ బూత్ లలో ఉన్న టీడీపీ ఏజంట్లు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. టీడీపీ ఎజెంట్స్ కూడా మాక్ పోలింగ్ లో..అంతా బాగుందని చెప్పారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

2014 లో ఈవిఎంల‌ ద్వారా నే గెలిచిన చంద్ర‌బాబు ఇప్పుడు వాటిపై న‌మ్మ‌కం లేద‌నడం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఓడి.. కాంగ్రెస్ గెలిచిన‌ప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. ఇదంతా కేవ‌లం ప్రజలు తన వైపు లేరని తెలిసి.. ప్రజల తీర్పుని, ప్రజాస్వామ్యాన్ని.. అపహాస్యం చేసే ప‌నిలో చంద్ర‌బాబు ఉన్నార‌ని జ‌గ‌న్ అన్నారు.