‘ధరణి’పై సీఎం కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు : వైఎస్ షర్మిల

‘ధరణి’పై సీఎం కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు : వైఎస్ షర్మిల

ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థలో కొత్త సమస్యలకు సృష్టికర్త కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ధరణితో రైతులకు మేలు కన్నా తీవ్ర అన్యాయమే జరిగిందన్నారు. ఎన్నికలు సమీపించే సరికి ధరణి వెబ్ సైట్ పై సీఎం కేసీఆర్ మాయ మాటలు చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం ఇవ్వకపోతే ధరణిని ఆపేస్తారని, అప్పుడు రైతుబంధు, రైతుబీమా రాదంటూ అబద్దాలను అందంగా వర్ణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు మొదలైన రెండేండ్ల తర్వాత ధరణి వచ్చిందని, మరి ఆ రెండేండ్లు రైతుబంధు, రైతుబీమా ప్రజలకు అందలేదా..? అని ప్రశ్నించారు.

ధరణితో కొత్తగా ఒరిగిందేమీ లేదని, పైగా పక్కా పారదర్శకంగా ఉన్న రైతుల భూములను వివాదస్పద జాబితాలోకి నెట్టివేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రతీ సోమవారం జిల్లాల కలెక్టరేట్లలో జరుగుతున్న ప్రజావాణికి వచ్చే సమస్యల్లో 90 శాతం ధరణి సమస్యలే ఉంటున్నాయన్నారు. ధరణి సర్వర్ భద్రత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టారని, ధరణి డీపీఆర్ ఎవరు రెడీ చేశారు..? ఎక్కడుంది..? దేనీ ఆధారంగా చేశారో ఇప్పటి వరకు బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. ధరణి పని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేస్తే.. ఒక్క సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే 35 శాతం సర్వే నంబర్లు గల్లంతైనట్లు తేలిందన్నారు. సిద్దిపేట జిల్లాలో 62 వేల193 మంది రైతులు తమ భూములు తారుమారయ్యాయని దరఖాస్తులు పెట్టుకున్నా పరిష్కారం చూపలేదన్నారు.

ధరణి పోర్టల్ లో భూ వివరాల నమోదు తప్పుల తడకగా మారిందని వైఎష్ షర్మిల చెప్పారు. భూములు కొనుగోలు చేసిన వారి పేర్లు కాకుండా పాత పేర్లే కనిపిస్తుండటంతో.. కొన్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. దీనిని సవరించేందుకు ఆప్షన్ కూడా ఇవ్వలేదన్నారు. ధరణిలో స్లాట్ బుక్ చేసుకుని, రద్దు చేసుకుంటే ఆ సొమ్ము వెనక్కి రావడం లేదని చెప్పారు. ‘‘ధరణికి ముందు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్‌ జరిగినా... వాటి మ్యుటేషన్‌ను అడ్డుకునే అధికారం తహశీల్దార్‌కు ఉండేది. కానీ.. ధరణి వచ్చాక రికార్డులు సరిగ్గా ఉంటే తిరస్కరించడానికి వీల్లేదన్న నిబంధనతో ప్రభుత్వ భూములు, నిషేధిత భూముల మ్యూటేషన్‌ జరగకుండా అడ్డుకునే అవకాశం పోయింది. అన్యాయంగా మ్యూటేషన్‌ జరిగిందని, జారీ చేసిన పాస్‌పుస్తకం రద్దు చేయాలని ఎవరైనా ఆర్డీవోకు, జాయింట్‌ కలెక్టర్‌కు గతంలో నివేదించే అవకాశం ఉండేది. ఇప్పుడు ధరణిలో ఆ అవకాశమే లేదు. అభ్యంతరాలుంటే కోర్టులో సవాల్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. రైతులు తమ సొంత పనులు వదులుకొని, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారసత్వంగా సంక్రమించిన భూమిని ఆస్తిదారు కుమారులు, ఇతర కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా విక్రయించడానికి వీల్లేదు. అయితే ధరణిలో ఇవేమీ పట్టించుకోకుండా ఎవరి పేరు మీద ఆస్తి ఉంటే... కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే విక్రయించుకోవడానికి అవకాశం ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

14 లక్షల ఎకరాల లావణ్య పట్టా భూములను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని వైఎస్ షర్మిల చెప్పారు. ‘‘ధరణి పోర్టల్ పట్టాలకు హద్దులు లేవు. సర్వేతో పాటు మ్యాపులు లేవు. సర్వేయర్స్ లేరు. డిజైన్ చేసే అధికారులు లేరు. సమస్యలపై దరఖాస్తులు తీసుకునే వారు కూడా లేరు. ధరణి వెబ్ సైట్ లో లక్షలాది సర్వే నంబర్లు కనిపించకుండా పోయాయి. దీంతో రైతులు మీ సేవా కేంద్రాలు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు’’ అంటూ వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.