కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ TSPSC పేపర్ లీక్ మీద లేదు: షర్మిల

కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ TSPSC పేపర్ లీక్ మీద లేదు: షర్మిల

తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ ఒక డిక్టేటర్ లా, ఒక మోనార్క్ లా, ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాలిబన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్...తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. దీని కోసమేనా విద్యార్థులు, ఎంతో మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకున్నదని కేసీఆర్ ను నిలదీశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకైతే కేబినెట్ సమావేశం పెట్టని కేసీఆర్..బిడ్డ కవిత లిక్కర్ స్కాంలో దొరికితే మాత్రం హుటాహుటిన కేబినెట్ సమావేవం నిర్వహించారని మండిపడ్డారు. 

 కేసీఆర్ తప్ప ఎవరూ బాగుపడలేదు..

తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రుణమాఫి పేరుతో  రైతులను, నిరుద్యోగ భృతి, పేపర్ లీకేజీ  పేరుతో నిరుద్యోగులను, హామీల పేరుతో ప్రజలను, ఉద్యమకారులను, ఉద్యోగాల పేరుతో విద్యార్థులతో కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. మిగుల బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కమీషన్ల కోసం మేఘా కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. రియల్ ఎస్టేట్ స్కాంలు, లిక్కర్ స్కాంలతో కేసీఆర్ కుటుంబం అక్రమంగా వేలకోట్లు సంపాధించిందన్నారు. 

జీతాలిచ్చేందుకు డబ్బుల్లేవ్..

బంగారు తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కనీసం డబ్బులు లేవని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ దగ్గర, రియల్ ఎస్టేట్ పేరుతో స్కాంలు చేసిన కేటీఆర్ దగ్గర, లిక్కర్ పేరుతో స్కాం చేసిన కవిత దగ్గర వేల కోట్లు ఉన్నాయని ఆరోపించారు. ధరణి పేరుతో భూములను కబ్జా చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదన్నట్లు..దేశాన్ని దోచుకోవడానికి బందిపోట్ల రాష్ట్ర సమితి తయారైందన్నారు. 

 

పేపర్ లీక్లో బోర్డ్ చైర్మన్, మంత్రుల హస్తం ఉంది..

TSPSC ది పెద్ద స్కాం అని వైఎస్ షర్మిల అన్నారు. ఇది అందరూ కుమ్మక్కు అయ్యి చేసిన స్కాం అని ఆరోపించారు. TSPSC పేపర్ లీక్ CBI తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. బోర్డ్ చైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో హస్తం ఉందన్నారు. ప్రశ్న పత్రాలు కావాలనే లీక్ చేశారని చెప్పారు.  బోర్డ్ మొత్తం రద్దు చేయాలన్నారు.  SIT తో దర్యాప్తు కరెక్ట్ కాదన్న ఆమె... SIT కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా విచారణ చేస్తుందని తెలిపారు. అందుకే CBI తో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు. TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందన్న షర్మిల...పేపర్ లీక్ అనేది ఒక పెద్ద స్కాం అని చెప్పారు. బోర్డ్ చైర్మన్ కి..సెక్రటరి తెలిసే పాస్ వర్డ్ లు బయటకు ఎలా లీక్ అయ్యాయని ప్రశ్నించారు. అంగట్లో సరుకులు అమ్ముకున్నట్లు TSPSC పేపర్లు అమ్ముతున్నారని మండిపడ్డారు.  ఒక్క AE పేపర్ కాదు అన్ని పేపర్లు లీక్ అయ్యి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 కూడా లీక్ అయ్యి ఉంటుందన్నారు. 

హైజ్ అరెస్ట్..

ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న షర్మిల శుక్రవారం టీఎస్‌ పీఎస్‌సీ దగ్గర ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.  ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తర్వాత హౌజ్ అరెస్ట్ చేసి ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు.