అర చేతిలో వైకుంఠం.. ఓట్లు పడ్డాక ఫామ్ హౌజ్లో ఉంటం.. 10 ఏండ్లుగా కేసీఆర్ చేస్తున్న మాయాజాలం ఇదే

అర చేతిలో వైకుంఠం.. ఓట్లు పడ్డాక ఫామ్ హౌజ్లో ఉంటం..  10 ఏండ్లుగా కేసీఆర్ చేస్తున్న మాయాజాలం ఇదే

4 కోట్ల తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాక్షేమానికి దొర చెప్పిన సంక్షేమానికి  పొంతనే లేదని విమర్శించారు.  జనాలను గొర్రెలను చేసి.. స్కీంల పేరిట బురిడీ కొట్టించి, ఓట్లు దండుకున్నాక అన్ని పథకాలకు పిండం పెట్టారని ఆరోపించారు. అర చేతిలో వైకుంఠం.. ఓట్లు పడ్డాక ఫామ్ హౌజ్ లో ఉంటం..గత పదేళ్లుగా సీఎం కేసీఆర్ ఇదే మాయాజాలం చేస్తున్నారని ఆరోపించారు.  మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా  4 కోట్ల  తెలంగాణ ప్రజలకు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. 

పదేళ్లలో ప్రజలకు ఎగనామం..

10 ఏళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు అమలు చేయని కేసీఆర్.. దేశానికి అసలైన దార్శనికుడని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.  సున్నా వడ్డీ పేరు చెప్పి 60లక్షల మంది మహిళలను మోసం చేశాడని... లక్ష  రుణమాఫీ అని చెప్పి 30 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు.  కేజీ టు పీజీ అని చెప్పి 2 వేల సర్కారీ బడులనే బంద్ పెట్టాడని విమర్శించారు.  పిల్లలకు సన్న బువ్వ అని చెప్పి 22 లక్షల మంది పిల్లలకు ఉన్న బువ్వ లేకుండా చేశారని మండిపడ్డారు. 3 వేల నిరుద్యోగ భృతి పేరు చెప్పి 50 లక్షల మంది నిరుద్యోగులకు పంగనామాలు పెట్టారని ఫైర్ చురకలంటించారు.  5 వేల రైతు బంధు చూపించి.. 35వేల సబ్సిడీ పథకాలను ఆపారని..3ఎకరాల భూ పంపిణీ పథకం 30మందికైనా దక్కకుండా  18 లక్షల మంది దళితులను మోసం చేశారని దుయ్యబట్టారు. 

కోమాలోకి ఆరోగ్యశ్రీ..

ఆత్మగౌరవం పేరు చెప్పి అర లక్ష మందికి కూడా  డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు.  10లక్షల మందిలో పట్టుపని 10 వేల మందికి రుణాలు ఇవ్వలేదన్నారు. దళిత బిడ్డలకు దక్కాల్సిన దళితబంధు ఎమ్మెల్యేలకు బంధువైందని ఆరోపించారు.  ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ చేసి కోమాలోకి నెట్టారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేసీఆర్ పాలనలో స్కీంలన్నీ స్కాంలే అని ఆరోపించారు. ప్రజల సొమ్ము దోచుకో.. ఫామ్ హౌజ్ లో దాచుకో..ఇదే కేసీఆర్ పాలనా సిద్ధాంతమని మండిపడ్డారు.  బంధిపోట్ల రాష్ట్ర సమితి  మేనిఫెస్టోకి విలువ లేదు..  చేసిన వాగ్దానానికి దిక్కులేదు..  ‘మస్త్ చెప్తం తియ్’ ఇదే కేసీఆర్ చెప్పే తల నరుక్కునే మాట అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.